Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తండ్రి పాలనలో దోపిడీ చేసిన వ్యక్తి చంద్రబాబుని, లోకేశ్ ని విమర్శించడమేంటి?: టీడీపీ

తండ్రి పాలనలో దోపిడీ చేసిన వ్యక్తి చంద్రబాబుని, లోకేశ్ ని విమర్శించడమేంటి?: టీడీపీ
, గురువారం, 23 జులై 2020 (17:44 IST)
ఇళ్లపట్టాల పంపిణీని టీడీపీ అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి దుర్మార్గంగా పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, అవినీతిని కప్పిపుచ్చుకునే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాడన్నారు.

పేదలకుఇళ్లపట్టాలు ఇవ్వడం తన ప్రభుత్వమేతొలిసారి చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, చట్టాల గురించి తెలుసుకుంటే మంచిదన్నారు. అవగాహనలేకుండా దళితులు, బీసీల భూములను, చెరువులు, కుంటలు, పోరంబోకు భూములను లాక్కున్నది జగన్ ప్రభుత్వం కాదా అని బండారు నిలదీశారు. 

అవగాహన లేకుండా ఎస్సీ చట్టాలు, ఇరిగేషన్ చట్టాల గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ముందుకెళితే కోర్టులు మొట్టికాయలు వేయవా అని బండారు ప్రశ్నించారు. 40, 50 ఏళ్ల నుంచి సాగుచేసుకుంటున్న భూములను పోలీసులు, అధికారుల సాయంతో లాక్కుంటే నష్టపోయిన వారు కోర్టులకు వెళ్లక ఎక్కడి కెళతారన్నారు. ఎస్సీ సంక్షేమానికి ఇచ్చిన నిధులను ఇళ్లపట్టాల పేరుతో దారి మళ్లించారని, భూసేకరణ పేరుతో రూ.1600కోట్లు కాజేశారన్నారు.

రాజమండ్రి ఎంపీ ఎంత నొక్కేశాడో జగన్ కు తెలియదా అని సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. ఇవన్నీ తెలుసుకోకుండా ప్రతిపక్షం ఇళ్లపట్టాలివ్వకుండా అడ్డుకుంటోందని బురదచల్లడమేం టన్నారు. 30లక్షల మందికి ఇళ్లపట్టాలిస్తున్నట్లు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం, అసలు నిజమైన అర్హులెవరో, భూమిలేని పేదలకు స్థలాలు అందుతున్నాయో లేదో ప్రజలమధ్యనే చర్చించడానికి రావాలని బండారు డిమాండ్ చేశారు.

లోపభూయిష్టంగా అనర్హుల జాబితాను ప్రభుత్వం తయారుచేసిం దన్నారు. హౌస్ ఫర్ ఆల్ పథకం కింద రాష్రం తరుపున కేంద్రానికి పంపిన నివేదికలో10లక్షల57 వేల మందికి ఇళ్లు లేవని చెప్పిన జగన్ సర్కారు అర్హుల జాబితాలో మాత్రం 30లక్షల మందిని ఎలా చేర్చిందో చెప్పాలన్నారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం 21లక్షల 52వేల మందికి ఇళ్లు లేవని సర్వేలద్వారా నిర్ధారించి, 21 లక్షల ఇళ్లనిర్మాణానికి  కేంద్రం నుంచి అనుమతులు పొంది, 12లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందన్నారు. వాటిలో 7లక్షల ఇళ్లు పూర్తయితే, 5లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. గతప్రభుత్వం పూర్తిచేసిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా వారిని వేధిస్తున్నది ఈ ప్రభుత్వం కాదా అన్నారు.

వివిధ కారణాలు చెబుతూ, టీడీపీ వారిపేర్లను ఇళ్లస్థలాల అర్హుల జాబితాలో చేర్చడం లేదన్నారు. పేదలకుఇచ్చిన ఇళ్లపట్టాలను అమ్ముకునే హక్కు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో-44ను హైకోర్టు తప్పుపట్టినా, 5ఏళ్లలో అమ్ముకునే హక్కును కల్పించింది  వైసీపీ కార్యకర్తలం కోసం కాదా అన్నారు. రూ.5నుంచి 10లక్షల పలికే ఎకరా భూమిని రూ.40 నుంచి 50లక్షలకు కొని మీ పార్టీ వారికే మేలుచేశారని సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైసీపీ ప్రభుత్వం చెబుతున్న 30లక్షల పేర్లలో  70శాతం వరకు తప్పుడుపేర్లే ఉన్నాయని, దోపిడీ కోసమే ప్రభుత్వం  ఈ కార్యక్రమానికి తెరలేపిందన్నారు. తాను చేస్తున్న వాదనలపై ఏ గ్రామంలోనైనా చర్చించి నిరూపించడానికి  సిద్ధంగా ఉన్నట్లు బండారు తెలిపారు. తనది అవాస్తవమని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, వైసీపీ వారు చర్చకు రావడానికి సిద్ధమేనా అని టీడీపీ నేత సవాల్ చేశారు.

కేంద్రానికి ఇచ్చిన నివేదికలో 10 లక్షల మందే ఉంటే, మిగిలిన 20లక్షల మంది ఎక్కడినుంచి వచ్చారో ప్రభుత్వం , అధికారులు చెప్పాలన్నారు. టిడ్కో ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు బకాయిలు చెల్లించకుండా, ఇళ్లు కేటాయించకుండా ప్రభుత్వం వేధిస్తోందన్నారు. 

పేదల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న జగన్, తండ్రి పాలనలో అందినకాడికి దోచుకొని బంగారు పళ్లెంలో భోజనం చేస్తూ, సిగ్గులేకుండా చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు ఎలా చేస్తాడన్నారు? కొండలు, గుట్టలు, శ్మశానాల పక్కన ఇచ్చే స్థలాలు ఎవరికి ఉపయోగపడతాయో కూడా ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదన్నారు. కోర్టులు తప్పుపడుతన్నా, దురహంకారంతో ముందుకెళితే ఈ ప్రభుత్వానికి తగినవిధంగా శిక్ష పడి తీరుతుందన్నారు.

జీడి, మామిడి తోటల రైతులను బెదిరించి భూములు లాక్కున్నది కాక, వారిపై బెదిరింపులకు పాల్పడితే, వారు కోర్టును ఆశ్రయిస్తే, ఆనెపాన్ని టీడీపీపై నెట్టడం దుర్మార్గమన్నారు. జగన్ చట్టవ్యతిరేక విధానాలను న్యాయస్థానాలు అడ్డుకుంటున్నాయి తప్ప, తెలుగుదేశం కాదనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలన్నారు.

ప్రభుత్వం చెబుతున్న 30లక్షల జాబితాలోని డొల్లతనాన్ని ఎప్పుడైనా నిరూపించడానికి తాను సిద్ధమని బండారు స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు చెప్పిన వారికే రేషన్, పింఛన్లు, ఇళ్లపట్టాలు ఇస్తున్నారని, ప్రభుత్వ ధనాన్ని వారికి దోచిపెడుతూ, ప్రజల జీవితాలతో వారు చెలగాటమాడేలా జగన్ సర్కారు ప్రోత్సహిస్తోందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెలివరీ కాగానే మహిళలకు రూ.5వేల రూపాయలు: జగన్‌