సినీ నటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణపై పోటీ చేసిన వైకాపా అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ ఓడిపోయారు. ఇపుడు ఈయనకు ఈ ఓటమే లక్కీ ఛాన్సుగా మారింది. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రిటైర్డ్ ఐజీ ఇక్బాల్‌కు హామీ ఇచ్చారు.
ఐజీగా విధులు నిర్వహిస్తూ వచ్చిన ఇక్బాల్ సర్వీసు నుంచి రిటైర్డ్ అయ్యాక వైకాపాలో చేరారు. ఆ తర్వాత ఆయను విజయవాడ లోక్‌సభ స్థానం ఇన్ఛార్జిగా నియమించారు. అలా కొన్ని నెలలు పాటు ఇన్‌చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చిన ఇక్బాల్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కర్నూలు జిల్లాలో ఏదేని అసెంబ్లీ స్థానంలో పోటీచేసే అవకాశం కల్పించాలని కోరారు. కానీ, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు కర్నూలు జిల్లాలో అసెంబ్లీ సీటును కేటాయించలేకపోయారు.
అదేసమయంలో అనంతపురం జిల్లాలోని హిందూపురం టిక్కెట్‌ను ఇచ్చారు. అయితే, ఇక్కడ నుంచి టీడీపీ తరపున సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేసి గెలుపొందారు. అంటే ఇక్బాల్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈ క్రమంలో ఏపీ సర్కారు మైనార్టీ నేతలకు సోమవారం రాత్రి గుంటూరులో ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ విందులో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తానని సభా వేదికపై నుంచి ప్రకటించారు. వాస్తవానికి బాలకృష్ణపై పోటీ చేసే సమయంలోనే ఓడిపోతే ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తానని ఇక్బాల్‌కు జగన్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు జగన్ ఇఫ్తార్ విందులో అధికారిక ప్రకటన చేశారు. దీంతో మైనార్టీ నేతలంతా హర్షం వ్యక్తంచేశారు.