సినీ నటుడు, హిందూపురం తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అరాచకాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రెట్టింపు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. అదేసమయంలో కార్యకర్తల కోసం తన ప్రాణం ఫణంగా పెడతానని తెలిపారు.
తన నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు అని వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.
తమను బెదిరించాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, తప్పకుండా బదులు తీర్చుకుంటామని బాలయ్య హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని స్పష్టం చేశారు. హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని అన్నారు. వైసీపీ అనుసరిస్తున్న తీరు టీడీపీకే కాదని, యావత్ సమాజానికి ప్రమాదకరం అని అభిప్రాయపడ్డారు.
'కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నా. ప్రాణాన్ని ఫణంగా పెడుతా. రాష్ట్రమంతా భయాందోళనలు సృష్టిస్తున్నారు. అఘాయిత్యాలకు అడ్డుకట్టవేసే వాళ్లు లేరనుకుంటున్నారు. హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే దానికి రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాం.
కార్యర్తలు సమాయత్తంగా ఉండండి. ఒకాయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఉక్కు కారాగారం అంటాడు. సీబీఐ కేసులకు వెళ్లి కారాగారం పదం బాగా అలవాటైంది. పోటీచేసే అభ్యర్థుల కుటుంబీకులు ఆఘాయిత్యాలకు పాల్పడేలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాష్ట్రంలో గాలి కూడా పీల్చే స్వేచ్ఛ లేకుండా పోయింది' అని మండిపడ్డారు.
వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాల మాటేమో గానీ, మద్యం, గంజాయి వంటివి మాత్రం అందుబాటులో ఉన్నాయని విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. కాగా ఇవాళ హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి మద్దతిస్తున్న 100 కుటుంబాలు బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరాయి. బాలయ్య రాకతో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.