ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పవన్ నటించిన తాజాగా చిత్రం "హరిహర వీరమల్లు" చిత్రం. గత నెల 24వ తేదీన విడుదలైంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు సమ్మతించింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.విజయకుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత సినిమా 'హరిహర వీరమల్లు' కోసం ప్రభుత్వ నిధులను వాడుకున్నారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు... దానిని విచారణకు స్వీకరించడంతో పాటు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లను కూడా చేర్చాలని రిజిస్ట్రీకి కోర్టు సూచన చేసింది. ఆ తర్వాత తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలాంటి పిటిషన్ దాఖలు కావడం, దాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించడం ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.