ఏపీకి తుఫాను ముప్పు పొంచివుంది. బంగాళాఖాతం- అరేబియా సముద్రం మీదుగా వాతావరణ పరివర్తనం కారణంగా భారీ వర్షాలు తప్పవని ప్రైవేట్ వాతావరణ వెబ్‌సైట్ స్కైమెట్ గురువారం తెలిపింది. లక్షద్వీప్, ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వాతావరణ పరివర్తనం కారణంగా వచ్చే మూడు నాలుగు రోజుల్లో, బహుశా అక్టోబర్ 12 లేదా 13 నాటికి మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో, నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక మీదుగా మరో తుఫాను ప్రభావం చూపుతోంది. ఇది అక్టోబర్ 12 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది.
ఈ వ్యవస్థ భారతదేశం తూర్పు తీరం వెంబడి కదిలే అవకాశం ఉంది. ఇది అల్పపీడనంగా బలపడి, అక్టోబర్ 16 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఇది దక్షిణ ద్వీపకల్పాన్ని దాటి అక్టోబర్ 18 నాటికి దక్షిణ కొంకణ్, గోవా తీరంలో అల్పపీడన ప్రాంతంగా ఉద్భవించవచ్చు.
ఈ జంట వాతావరణ వ్యవస్థల ప్రభావం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో గణనీయంగా ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న రోజుల్లో తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.
కోస్తా ఆంధ్ర ప్రదేశ్, కోస్తా తమిళనాడు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ కర్ణాటకలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం వుంది. ఫలికంగా అక్టోబర్ 15- అక్టోబర్ 17 మధ్య తెలంగాణ, దక్షిణ కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర వైపు వర్షాలు పడే అవకాశం వుంది.