భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయస్. జగన్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
కాపు నేస్తం పథకం అమలు వర్చువల్ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లకు సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. వివిధ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్కడైనా అనుకోని సంఘటనలు సంభవిస్తే, వెంటనే కమాండ్ కంట్రోల్ కి తెలియజేయాలని సూచించారు. అలాగే సంబంధిత మంత్రులు అప్రమత్తంగా ఉండి, ఆయా శాఖాధికారులను అలర్ట్ చేయాలని, ప్రజలకు ధన, ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.