ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఈ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. ఈ క్రమంలో ఇపుడు మరో దఫా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
గూడూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా మనుబోలు - పొదలకూరుల మధ్య వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అలాగే, గూడూరు - వెంకటగిరి ప్రాంతాల మధ్య కూడా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గూడూరులో కురుస్తున్న భారీ వర్షానికి ఆర్టీసీ బస్టాండులోకి పూర్తిగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో డిపోలోని బస్సులను మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇక భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కండలేరు జలాశయం ప్రమాదపుటంచుల్లో ఉంది.
జలాశయం కట్ట కోతకు గురవుతుంది. ఈ జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 68 టీఎంసీలు కాగా, ఇప్పటికే 60 టీఎంసీల నీరు నిల్వవుంది. దీంతో లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.