ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 22, 23 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. అల్పపీడన ప్రభావం కారణంగా వాతావరణం చల్లబడటంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఉత్తర కర్నాటక, గోవా తీరాల నుంచి కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఆకాశం మరో రెండు రోజుల పాటు మేఘావృతమై ఉంటుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
శుక్రవారం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం కోనసీమ, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.