Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

rain
, శుక్రవారం, 5 ఆగస్టు 2022 (08:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. 
 
ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోతగా వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. 
 
ఇక వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. 
 
మరోవైపు, ఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. 
 
కాగా 7న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. ఫలితంగా 7, 8 తేదీల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా, కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. 
 
నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభమయ్యాక ఇప్పటివరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. కానీ అవి అల్పపీడనాలకే పరిమితమయ్యాయి తప్ప వాయుగుండంగా బలపడలేదు. జూలై 9న వాయవ్య బంగాళాఖాతంలో, 16న అదే ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 7న ఏర్పడబోయే అల్పపీడనం మూడోది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వదిన, మరిది వివాహేతర సంబంధం,.. కన్నపేగుకు ఉరి