Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ పోర్టుకు భారీ కార్గో నౌక

విశాఖ పోర్టుకు భారీ కార్గో నౌక
, మంగళవారం, 1 డిశెంబరు 2020 (07:32 IST)
విశాఖ పోర్టు ఇన్నర్‌ హార్బర్‌కు 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల వెడల్పు కలిగిన భారీ సరుకు రవాణా (కార్గో) షిప్‌ డబ్ల్యు ఓస్లో వచ్చింది. సౌత్‌ ఆఫ్రియాలోని రిచర్డ్‌ బె పోర్టు నుంచి వచ్చిన ఈ షిప్‌లో 87,529 మెట్రిక్‌ టన్నుల నాన్‌ కుకింగ్‌ కోల్‌ ఉంది.

ఈ సరుకులో శారదా మెటల్స్‌ అండ్‌ అల్లోరుస్‌కు 27,029 మెట్రిక్‌ టన్నులు, శారద ఎనర్జీ అండ్‌ మినరల్స్‌కు 60,500 టన్నులు చేరనుంది. విశాఖలోని గ్రీన్‌ ఎనర్జీ అనే స్టీవ్‌ డోర్‌ కంపెనీకి చెందిన చౌగ్లీ అనే ఏజెంట్‌ ద్వారా ఇది ఇక్కడకు వచ్చింది.

పోర్టు హార్బర్‌లోని ఈక్యూ బెర్త్‌ నెంబరు 7లో వెనువెంటనే ఈ భారీ నౌకకు బెర్త్‌ను అందజేశారు. సాధారణంగా పోర్టులకు వచ్చే కార్గో నౌకలకు వెంటనే బెర్త్‌లు దొరకడం సాధ్యపడదు. కానీ, ఇంతవరకూ వైజాగ్‌ పోర్టు ఇంత భారీ స్థాయిలో సరుకును హేండిల్‌ చేయడం ఇదే తొలిసారి.

ఇప్పటివరకూ 32.5 మీటర్ల భీమ్‌ కలిగిన నౌకలను మాత్రమే అనుమతించేందుకు అవకాశం ఉండేది. ఓస్లో నౌకను చైనాలో 2011లో నిర్మించారు.

సిములేషన్‌ స్టడీ ప్రభావం...
2019 అక్టోబర్‌లో సింగపూర్‌కు చెందిన పోర్టు నిపుణుల బృందం విశాఖ పోర్టులో నిర్వహించిన సిమ్ములేషన్‌ స్టడీ వల్ల విశాఖ పోర్టు ట్రస్ట్‌ ఇన్నర్‌ హార్బర్‌లోకి 45 మీటర్ల భీమ్‌ (పొడవు) కలిగిన నౌకలను హ్యాండిల్‌ చేసే అవకాశం కూడా తాజాగా ఏర్పడింది. అయితే, పోర్టులోకి సరుకుతో వచ్చే నౌకలకు వెనువెంటనే బెర్త్‌లు లభించకపోవడంతో అవుటర్‌ హార్బర్‌లోనే ఉండిపోవడం తెలిసిందే.

ఇలా ఉన్నందున ఇటీవలే బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవి.మా అనే భారీ కార్గో షిప్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 13న బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను గాలుల తాకిడికి అవుటర్‌ హార్బర్‌ నుండి తెన్నేటి పార్కు ఒడ్డుకు కొట్టుకుపోయి కదల్లేని పరిస్థితి నెలకొంది. ఇలా భారీ నౌకలను సముద్రం మధ్యలో (పోర్టులో బెర్త్‌ ఇవ్వకుండా) వదిలేస్తే వందల కోట్ల రూపాయలు నష్టం వస్తుందన్న ముందుచూపుతో పోర్టు ఉన్నతాధికారులు వెనువెంటనే తాజాగా ఓస్లో నౌకకు బెర్త్‌ చూపించినట్లు సమాచారం.

వైజాగ్‌ కంటైనర్‌ టెర్మినల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (విసిటిపిఎల్‌) వైజాగ్‌ హార్బర్‌ జెట్టీ వద్ద ఒక టెర్మినల్‌ను ఏడాదిగా నిర్మిస్తోంది. ఇది 2021 సంవత్సరం నాటికి పూర్తి కానుంది. దీని నిర్మాణం పూర్తయితే జెట్టీ సామర్థ్యం పెరిగి మరిన్ని నౌకలు భవిష్యత్తులో రావడం ద్వారా పోర్టు ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి: కేంద్రం