Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో కొనసాగుతున్న వేడిగాలు.. తెలంగాణాలో వర్షాలు...

heat wave
, శుక్రవారం, 19 మే 2023 (18:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతోంది. గడచిన నాలుగైదు రోజులతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వడగాల్పుల ప్రభావం కొద్దిమేర తగ్గిందని.. ప్రస్తుతం పూర్తి పొడి వాతావరణమే కొనసాగుతోందని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని తెలిపింది. 
 
మరో రెండు నుంచి మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. నంద్యాల జిల్లా డోర్నిపాడు, నెల్లూరులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని వెల్లడించింది. శ్రీకాకుళంలో 42.8 డిగ్రీలు, బాపట్లలో 42.7, అనంతపురంలో 42.5, తిరుపతిలో 42.4, కర్నూలు, అన్నమయ్య జిల్లా, ఆళ్లగడ్డ, మహానంది, కడప జిల్లాలో 42.5, ప్రకాశం జిల్లాలో 42.4, పల్నాడు జిల్లాలో 41.8, చిత్తూరు జిల్లాలో 41.7, ఎన్టీఆర్‌ జిల్లాలో 41.4, సత్యసాయి జిల్లాలో 41, నరసరావుపేటలో 41.2, గుంతకల్‌లో 41, సూళ్లూరుపేటలో 41.2, జమ్మలమడుగులో 41.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. 
 
అదేవిధంగా తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు పేర్కొంది. 
 
తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 9 కి.మీ ఎత్తులో ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు దిగువ స్థాయి గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలోని కొన్ని భాగాల వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్సాం లేడీ సింగం రాభాను చంపేశారా?