ఆస్తి కోసం అక్కను చంపేశాడో తమ్ముడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని ఈస్ట్ ప్రశాంత్ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ ప్రశాంత్ నగర్‌కు చెందిన మైసయ్య - నిర్మల అనే దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, సిద్ధార్థ్ అనే కుమారుడు ఉన్నాడు. వీరిలో శివనందినికి వివాహమై ఏడున్నరేళ్ళ వయుసున్న కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడుకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే, కుటుంబ గొడవల కారణంగా శివనందిని భర్తతో విడాకులు తీసుకుని పుట్టింట్లోనే నివశిస్తోంది. ఈ క్రమంలో ఆస్తి పంపకాల్లో శివనందినికి, సిద్ధార్థ్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. పుట్టింటి ఆస్తిలో భాగంకావాలని శివనందిని కోరింది. దీనికి సిద్ధార్థ్ ససేమిరా అన్నారు. దీంతో వారిద్దరి మధ్య వైరం నెలకొంది.
దీంతో అక్కకు ఆస్తి ఇవ్వరాదన్న అక్కసుతో ఆమెను తమ్ముడు సిద్ధార్థ్ చంపేశాడు. ఆ తర్వాత తన అక్క కనిపించడం లేదంటూ ఈనెల 17వ తేదీన మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల నుంచి విచారించారు. చివరకు శివనందిని ఆమె ఇంట్లోనే చనిపోయిన స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. ఇంటి మరుగుదొడ్డిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. దాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత పోలీసులు సిద్ధార్థ్‌ను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు నిజం వెల్లడించారు. ఆస్తి విషయంలో తమ మధ్య గొడవలు తలెత్తడంతో అక్కను చంపేసినట్టు చెప్పారు. నేరం తనపైపురాకుండా ఉండేందుకు మిస్సింగ్ కేసు పెట్టినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో సిద్ధార్థ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.