తల్లి గర్భంలో తలలేని కవలలు

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (08:05 IST)
కడుపులో తల లేని కవలలున్న గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో ఆదివారం కన్నుమూసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి ఎస్సీ కాలనీకి చెందిన యుగంధర్‌ భార్య అన్నపూర్ణ (27) గర్భం దాల్చింది.

అప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ పలమనేరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఈ నెల 9న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యులు చిత్తూరులో స్కానింగ్‌ సెంటర్‌కు పంపారు.

స్కాన్‌ చేయగా కడుపులో తలలు లేని కవలలున్నట్టు తేలింది. దీంతో అబార్షన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 10న ఆమెకు గర్భస్రావ మాత్రలిచ్చారు.
 
వాటిని వేసుకున్నాక ఆమెకు ఫిట్స్‌ రావడంతో వెంటనే కుప్పం మెడికల్‌ కళాశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి మెదడులో రక్తం గడ్డ కట్టిందని తేల్చారు.

అక్కడ న్యూరో సర్జన్‌లు లేరని ఆమెను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అన్నపూర్ణ మృతికి సంబంధించిన నివేదికను మండల వైద్యాధికారి డాక్టర్‌ మురళీకృష్ణ డీఎంహెచ్‌వోకు పంపనున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బీజేపీకి మిత్రపక్షం వైసీపీ: పీసీసీ