Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన శోభ

Advertiesment
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన శోభ
, శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (10:20 IST)
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజాము నుంచే శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ఈ పర్వదినాన శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు బారులు తీరారు. ఉపవాస దీక్షలు, జాగాలతో స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 
 
ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడల్లో భక్తులు అర్థరాత్రి నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీశైలంలోని స్వయంభుగా వెలిచిన మల్లికార్జునస్వామి-భ్రమరాంబదేవీల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో శుక్రవారం సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ, లిగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం జరగనుంది. రాత్రి 12 గంటలకు శ్రీభమరాంబ-మల్లికార్జునస్వామి వార్ల బ్రహోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు.
 
అలాగే, దక్షిణకాశీగా పిలువబడే వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయ పరిసరాలు శివనామస్మరణ ధ్వనిస్తోంది. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. శివరాత్రి నేపథ్యంలో అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులకు మహాలఘు దర్శనం కల్పిస్తున్నారు. 
 
ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున రాజరాజేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 8 గంటలకు ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 4 గంటలకు శివదీక్ష పరులకు అధికారులు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి గర్భగుడిలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. 
 
అదేవిధంగా మహశివరాత్రి మహాత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళస్తీశ్వర స్వామి అమ్మవార్లకు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలను స్వామి అమ్మవారికి అలంకరించి ఆలయ అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి తన కుటుంబ సభ్యులతో స్వామి అమ్మవారులను దర్శించుకున్నారు. గురుదక్షిణమూర్తి వద్ద వేదపండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి కుటుంబ సభ్యులకు శాలువతో సత్కరించి స్వామి అమ్మవారిల చిత్రపటాన్ని బహుకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు