ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై ప్రభుత్వ వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని, దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వివిద్యాలయం పేరు మార్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.
ఈ యూనవర్శిటీ పేరు మార్పుపై ఆయన స్పందిస్తూ, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చారని, ఎన్టీఆర్ గారి మనసును మీ వికృత రాజకీయాల కోసం క్షోభ పెట్టొద్దు సీఎం జగన్ అంటూ జీవీఎల్ హితవు పలికారు.
అంతేకాకుండా, యుగ పురుషుడు ఎన్టీఆర్ నుంచి టీడీపీని దక్కించుకోవడం కోసం ఒకప్పుడు ఒక పోటు పొడిచి ఆయన మరణానికి కారకులైనవారు ఇపుడు ఆయనపై అతి ప్రేమ కనబరుస్తున్నారంటూ విమర్శించారు. ఇలాంటి వారు కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను 'నువ్వు వారసుడివా' అని వెక్కిరించడం, అవమానించడం, కార్యకర్తలను ఉసిగొల్పడం రాజకీయ వికృతానికి, దగా రాజకీయాలకు పరాకాష్టగా పేర్కొన్నారు.
భగవంతుడి ప్రతిరూపంగా ప్రజల మనసులో నిలిచిన ఎన్టీఆర్‌ను వివాదంలోకి లాగడం ద్వారా వైసీపీ ముమ్మాటికీ దుర్మార్గానికి పాల్పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు.