గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకంగా ఉన్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై స్థానిక టీడీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన నాయకత్వం తమకొద్దనే వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఆ జిల్లాకు చెందిన పార్టీ నేతలు బుధవారం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు.
కోడెల నాయకత్వంపై అసంతృప్తిగా తెలుగుతమ్ముళ్లు ప్రకటించారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి కొత్త ఇంచార్జి నియమించాలని చంద్రబాబును కోరనున్నారు. సత్తెనపల్లి పట్టణంలో పాతతెదేపా కార్యాలయం తిరిగి ప్రారంభించారు. కోడెల నాయకత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు. నూతన నాయకత్వం వస్తే రానున్న మున్సిపల్, పంచాయతీ యంపిటిసి, జెడ్పీటీసీ, సోసైటీ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపుతామని చంద్రబాబుకు వివరించనున్నారు. సుమారు 200 మందికి పైగా వాహనాలలో వెళ్లి చంద్రబాబును కలుసుకోనున్నారు.