Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఔరా కోడలు పిల్లా.. సొంత ఇంటికే కన్నం వేసింది.. ఎక్కడ?

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అత్తా కోడళ్లను కట్టేసి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని పట్టపగలే దొంగలు దోచుకెళ్లిన కేసులో ప్

ఔరా కోడలు పిల్లా.. సొంత ఇంటికే కన్నం వేసింది.. ఎక్కడ?
, శనివారం, 16 జూన్ 2018 (08:50 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అత్తా కోడళ్లను కట్టేసి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని పట్టపగలే దొంగలు దోచుకెళ్లిన కేసులో ప్రధాన నిందితురాలు ఆ ఇంటి కోడలు పిల్లే అని తేల్చారు. అచ్చం టీవీ సీరియల్స్‌లో వచ్చే క్రైమ్ సన్నివేశాలతో ఓ మాస్టర్ ప్లాన్ వేసి ఈ దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దోపిడీ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురుని అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గుంటూరు జిల్లా పెనుమాకకు చెందిన మేకా వేమారెడ్డి-కమల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బ్రహ్మారెడ్డి భార్య శివపార్వతితో కలిసి తల్లిదండ్రులతో ఉంటున్నాడు. రెండు నెలల క్రితం వేమారెడ్డి తనకున్న పొలాన్ని విక్రయించగా రూ.2 కోట్లకుపైగా వచ్చింది. ఆ సొమ్ముతో కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం దేవేంద్రపాడులో రెండున్నర ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారు. అడ్వాన్సుగా రూ.40 లక్షలు ఇచ్చారు. మరో 2-3 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ఉండటంతో మిగతా సొమ్ము రూ.1.60 కోట్లను ఇంట్లోనే దాచిపెట్టారు.
 
డబ్బులు ఇంట్లోనే దాచిన విషయాన్ని చూసిన కోడలు శివపార్వతి ఆ విషయాన్ని తన అక్క లక్ష్మీప్రసన్నకు, వరుసకు కొడుకయ్యే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంగా సీతారామిరెడ్డికి చెప్పింది. ముగ్గురూ కలిసి ఆ సొమ్మును కొట్టేయాలని పక్కా ప్లాన్ చేశారు. వీరికి సీతారామిరెడ్డి తండ్రి వెంకటరెడ్డి తోడయ్యారు. తన స్నేహితుడైన చింతల చెరువు రాజుని దోపిడీ విషయంపై సంప్రదించాడు. అతడికి హెడ్‌కానిస్టేబుల్ చెంబేటి శ్రీనివాసరావు కుమారుడు మల్లికార్జునరావుతో పరిచయం ఉంది. అతడు తోట గోపీచంద్, సాయిలు అనే మరో ఇద్దరిని ఈ పథకంలోకి తీసుకొచ్చాడు.
 
ఇలా మొత్తం 8 మంది కలిసి పక్కాగా మాస్టర్ ప్లాన్ వేశారు. సొమ్మును తీసుకొచ్చి ఇచ్చే పనిని మల్లికార్జునరావుకు అప్పగిస్తూ ఇందుకు రూ.20 లక్షలు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. శివపార్వతి ఎప్పటికప్పుడు ఇస్తున్న సమాచారంతో దోపిడీ కోసం అనువైన సమయం కోసం ఎదురుచూస్తుండగా గురువారం ముహూర్తం కుదిరింది.
 
గురువారం ఉదయం రిజిస్ట్రేషన్ పనిపై వేమారెడ్డి, బ్రహ్మారెడ్డి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన శివపార్వతి విషయాన్ని సీతారామిరెడ్డికి చేరవేసింది. రెండు బైక్‌లపై నలుగురు, కారులో సీతారామిరెడ్డి బయలుదేరి వేమారెడ్డి ఇంటికి చేరుకున్నారు. మల్లికార్జునరావు, గోపీచంద్, సాయి, వేమారెడ్డి ఇంట్లోకి ప్రవేశించి అత్త కమలను తాళ్లతో బంధించారు. పక్కనే ఉన్న శివపార్వతి వచ్చి కనుసైగలతో బీరువాలో ఉన్న డబ్బును చూపించింది. దీంతో కమల వద్ద ఉన్న తాళాలను తీసుకుని బీరువాలో రూ.55.20 లక్షలు ఉన్న బ్యాగ్‌ను తీసుకుని వెళ్లిపోయారు.
 
వారు అటువెళ్లిపోగానే, పక్క గదిలోనే ఉన్న మరో బీరువాను తెరిచిన శివపార్వతి అందులోని సామాన్లను చిందరవందర చేసి విసిరేసింది. పెన్నుతో చేతిపై గీసుకుంది. పోలీసులు వచ్చినప్పుడు దొంగలు తనను కొట్టి 300 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లినట్టు చెప్పింది. అయితే, ఆమె తన వద్ద బంగారాన్ని గతంలోనే గుంటూరులో తాకట్టు పెట్టినట్టు తేలడంతో పోలీసులు అనుమానించారు.
 
శివపార్వతి తీరుపై అనుమానంతో కాల్‌డేటాను పరీక్షించడంతో అసలు గుట్టురట్టయింది. ఆ తర్వాత శివపార్వతిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం కక్కింది.  సీతారామిరెడ్డి స్నేహితుడు చింతలచెరువు రాజు ఇంట్లో దాచిన దోపిడీ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మల్లికార్జునరావుకు రూ.12.5 లక్షలు, గోపీచంద్‌కు రూ.2 లక్షలు, సాయికి రూ.2.80 లక్షలు ఇచ్చినట్టు గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్క కోసం కవల పిల్లలను చంపేసిన మేనమామ... ఎక్కడ?