Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ స్టీల్ ప్లాంట్ సభపై గుడివాడ అమర్నాథ్ 12 పాయింట్లు

Advertiesment
పవన్ స్టీల్ ప్లాంట్ సభపై గుడివాడ అమర్నాథ్ 12 పాయింట్లు
, ఆదివారం, 31 అక్టోబరు 2021 (22:11 IST)
రాజకీయాల్లో ఒంటరి పోరాటం ఎలా చేయాలో జగన్ గారిని చూసి నేర్చుకో పవన్ కల్యాణ్ అంటూ వైసిపి అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
 
1- విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా.. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు, విశాఖ ప్రజలు, అయిదుకోట్ల ఆంధ్రులంతా పెద్ద ఎత్తున దాదాపు 260 రోజులుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. అయితే ఇవాళ ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు, కేంద్ర ప్రభుత్వం, బీజేపీతో కలిసి నడుస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ వచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్పి వెళ్ళాడు.

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అని, పరిశ్రమను కాపాడుకోవాలనుకునే ఉద్దేశంతో అందరూ ఎనిమిది, తొమ్మిది నెలలుగా పోరాటం చేస్తున్నా... ఇంతవరకూ ఎక్కడా కనిపించని పవన్ కల్యాణ్.. ఇవాళ హఠాత్తుగా తెరమీకు వచ్చారు. ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న బీజేపీని వదిలేసి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.

 
2- కేంద్రంలోని బీజేపీ సర్కార్‌... విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించిన తర్వాత, పవన్‌ కల్యాణ్‌ ఏం మాట్లాడాడో ఆ మాటల్ని మీడియా ముందు ఉంచుతున్నాం. ఆ మాటలను రాష్ట్ర ప్రజలంతా వినాలని కోరుతున్నాం. పెట్టుబడుల ఉపసంహరణ అనేది దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ తీసుకున్న నిర్ణయమే అంటూ అందుకు సంబంధించిన వీడియోను గుడివాడ అమర్ ప్రదర్శించారు.
 
- ఒక స్థిరత్వం లేని వ్యక్తి మాటలు విన్న తర్వాత ... విశాఖలో పవన్‌ చేసిన ప్రసంగాన్ని విన్నతర్వాత విశాఖ ఉక్కు కార్మికులు సమాధానం చెప్పాలి. పవన్‌ చేసిన ప్రసంగానికి ఏమాత్రం అయినా విలువ, స్థిరత్వం ఉందా అని అడుగుతున్నాం? గతంలో పవన్‌ మాట్లాడిన ఈ మాటలు .. ఆయనకు గుర్తున్నాయా అని ప్రశ్నిస్తున్నాం?

 
- మొన్నక మాట, నిన్నో మాట, ఇవాళ విశాఖపట్నం వచ్చి మరో మాట మాట్లాడతారా? అసలు రాష్ట్ర ప్రజల్ని మీరు ఏం అనుకుంటున్నారు? అతను మాట్లాడిన మాటలను ప్రజలు ఏరోజుకు ఆరోజు మర్చిపోతారు. ఏ రోజుకారోజు కొత్త మాటలు, కొత్త పోరాటాలకు తెర లేపుతానంటూ, బీజేపీ ఎజెండాను భుజం మీద వేసుకుని వచ్చి, ఇవాళ వైయస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికా మీరు సభ పెట్టింది?

 
3- వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రిని, పార్లమెంటు సభుల్ని, శాసనసభ్యుల్ని విమర్శించడానికి ఓ వేదిక కావాలని... స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్న విశాఖ వేదికను ఆధారం చేసుకుని లేనిపోని మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయదలచుకున్నారా.. అని అడుగుతున్నాం. ఇదే స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా గతంలో తాను మాట్లాడింది తప్పు అని పవన్‌ లెంపలు వేసుకుని క్షమాపణ చెబుతారా? ఓ వైపు బీజేపీతో ఢిల్లీ స్థాయిలో మీ స్నేహాలు కొనసాగిస్తూ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నెపాన్ని అంతా వైయస్సార్‌ సీపీపై నెట్టేసి రాజకీయ పబ్బం గడుపుకోవడం సమంజసం కాదు.

 
4- విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వానిదా? రాష్ట్ర ప్రభుత్వానిదా అనే దానిపై పవన్‌ కల్యాణ్‌ సూటిగా సమాధానం చెప్పాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వపు ఆస్తా? లేక రాష్ట్రానిదా అనే దానికి పవన్‌ స్పష్టత ఇవ్వాలి. 1960లో పదేళ్లపాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉక్కు కర్మాగారాన్ని విశాఖలో పెట్టాలంటూ 32మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నారు. అలాంటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయస్తే, దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం జరుగుతుంటే... పవన్‌ కల్యాణ్‌ దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగిన చందంగా.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్రేమ ఉన్నట్లు, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉన్నట్లు, పరిశ్రమను కాపాడే వ్యక్తిలా ఈరోజు మాట్లాడితే ... వాటిని విని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

 
- అందుకే మీ మాటలు, మీ తాలుకా సిద్ధాంతాలు నమ్మలేదు కాబట్టే పవన్‌ను గాజువాక ప్రజలు ఓడించారు. మీ పార్టీ సమావేశంలో మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయారా పవన్‌?
- "గాజువాకలో నన్ను ఓడించారు, అదే గెలిపిస్తే పోరాటం చేసేవాడిని కదా" అని మీరు మాట్లాడింది నిజం కాదా... మరి ఇవాళేమో రాజకీయాల్లో ఓడిపోయినా పోరాడే వ్యక్తిని అంటూ ఒక సినిమాలో డైలాగ్‌ మరో సినిమాలో ఉండదు కాబట్టి.. రాష్ట్రంలో రాజకీయాలు కూడా ఆరకంగా చేస్తానంటే నమ్మి మోసపోవడానికి ఇది సినిమా కాదు పవన్‌ కల్యాణ్‌.

 
-  మీ సినిమా డైలాగులతో ఎంతకాలం మోసం చేస్తారు? 2009లో చిరంజీవిగారు పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడు, ఒక రాజకీయ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు కదా? మరి 2014 వరకూ మీరు ఎక్కడ ఉన్నారు? ఓడిపోయిన మీరు అయిదేళ్ల పాటు ప్రజా సమస్యలపై ఎందుకు పోరాటం చేయలేదు. ప్రజల గురించి ఎందుకు ఆలోచన చేయలేదు. ఇంకా సినిమా డైలాగులు చెప్పి, ప్రజల్ని మోసం చేయాలనే చూస్తున్నారు.

 
5- మీరు వచ్చినా రాకపోయినా.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇక్కడ పోరాటం కొనసాగుతోంది. ఆ పోరాటానికి మా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంది. మా పార్టీ ముందుండి పోరాటం నడిపిస్తోంది. మా పార్టీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నేత  విజయసాయిరెడ్డి గారు అ‍న్ని రాజకీయ పార్టీలను, కార్మిక సంఘాలను కలుపుకుని 26 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకించారు.

 
- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారు విశాఖ వచ్చి... అన్ని కార్మిక సంఘాలతో గంటపాటు సమావేశమై అన్ని అంశాలు చర్చించి, నెలరోజుల తిరక్కముందే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపారు. 

 
6- పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీగారి గురింటి ఒక్క మాట అయినా మాట్లాడారా..? పెట్టుబడుల ఉపసంహరణ అన్నది ఈరోజు మాటకాదు.. పీవీ నరసింహారావుగారి హయాం నుంచి ఉన్నదే అంటూ ఎంతబాగా తప్పించుకున్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలో మీ స్నేహితుల మీద, కేంద్రం మీద పోరాటం చేయండి.

 
7- ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ గతంలో మాట్లాడిన పవన్‌ ఇప్పుడు వాటినే దాచుకుని తింటున్నారా? లేదా ఆ లడ్డూలు ఇప్పుడు రుచిగా మారాయా.. అన్నది ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు వ్యక్తిగత జీవితంలో ఉన్న గందరగోళాన్ని అంతా రాజకీయాల్లోకి తీసుకువచ్చి వాటిని ప్రజల మీద చూపిస్తున్నారు.

 
- పవన్‌కు దేంట్లోనూ స్థిరత్వంగానీ, ఒక సిద్ధాంతంగానీ లేదు. ఇప్పటికి ఎన్ని రాజకీయ పార్టీలను మార్చారో సమాధానం చెప్పండి. ఇప్పటికి మూడు పార్టీలు మార్చారు. మొదట ప్రజారాజ్యం, 2014లో టీడీపీ, 2019 తర్వాత బీజేపీని, మధ్యలో కమ్యూనిస్టులు.. ఎన్ని పార్టీలు మార్చారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మళ్లీ కొత్తవారిని చూసుకుంటారా.. అనేది రాజకీయాల్లో మీకు స్థిరత్వం లేని ఆలోచనలు, సిద్ధాంతాలకు నిదర్శనం.

 
8- విశాఖ ఉక్కుకు సొంత గనులు ఎందుకు ఇవ్వడం లేదంటూ పవన్‌ కల్యాణ్‌ అజ్ఞానమైన ప్రశ్న వేశారు. 40 ఏళ్ల నుంచి నడుస్తున్న స్టీల్‌ప్లాంట్‌ అనేక రాజకీయ ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచింది. అలాంటిది అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిన వైయస్సార్‌ సర్కార్‌ విశాఖకు సొంత గనులు ఎందుకు అడగటం లేదు, అందుకే స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలనే దానిపై వైయస్సార్‌ సీపీ కట్టుబడి ఉంది. ఇవ్వొద్దని మేము ఎప్పుడూ చెప్పలేదే? ఇవ్వమనే కోరుతున్నాం. మీరు సహచర్యం చేస్తున్న భారతీయ జనతా పార్టీని ఇవ్వమని అడగండి. దానిపై ప్రశ్నించకుండా వైయస్సార్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో కాఫీలు తాగి కూర్చున్నారు అని మాట్లాడుతున్నారే? 260 రోజులుగా కార్మికులు దీక్షలు, పోరాటాలు చేస్తుంటే.. మరి మీరేమి తాగి కూర్చున్నారు? కేంద్రం విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తన నిర్ణయం ప్రకటించిన తర్వాత మీరేం చేశారో, ఎక్కడున్నారో ప్రజలకు చెప్పండి.

 
9- అయిదుకోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. మరి మీరు తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చారు? వీటన్నింటికీ పవన్‌ సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో అందరూ కళ్లు మూసుకుని కూర్చున్నారు, పట్టించుకోవడం లేదనుకుని.. పైపెచ్చు వైయస్సార్‌ సీపీ ఎంపీలను పట్టుకుని మీ ఇష్టానుసారంగా మాట్లాడతారా? పార్లమెంట్‌లో వాయిదా తీర్మానాలు ఇవ్వడం, పోడియం ముందు నిరసనలు తెలపడం, రెండుసార్లు ముఖ్యమంత్రిగారు కేంద్రానికి లేఖలు రాయడం.. ఇవన్నీ మేం చేసినా... ఏం తాగి కూర్చున్నారని అడుగుతున్నారు. గాజువాక ప్రజలు పవన్‌ను ఓడించారన్న అక్కసుతో కేంద్రంలోని మీ మితృత్వ బీజేపీ పెద్దలతో మాట్లాడటం, పోరాటం చేయడం మానేసి, బీజేపీ చంకనెక్కి తిరుగుతూ మళ్లీ వైయస్సార్‌ సీపీని విమర్శిస్తారా?

 
10- విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని చెబుతారా? పవన్‌ కల్యాణ్‌ ఎంత తెలివిగా మోసం చేస్తున్నారో వేదిక మీద ఉన్న కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నాం. బీజేపీ ఎజెండాను తన భుజానికెత్తుకుని అమలు చేయాలని పవన్‌ చూస్తున్నారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందన్న ఆయన మాటలను వైయస్సార్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లాభాల్లో ఉందికానీ, నష్టాల్లో లేదు. పవన్‌ వ్యాఖ్యలను కార్మిక సంఘాలు తక్షణమే ఖండించాలని కోరుతున్నాం.

 
11- వైయస్సార్‌ సీపీ పరిశ్రమ మాత్రమే లాభాల్లో ఉందని విమర్శలు చేస్తున్న పవన్‌ కల్యాణ్‌.. ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.  అటు ప్రతిపక్షంలోగానీ, ఇటు అధికార పక్షంలోగానీ లేకుండా అత్యధికంగా డబ్బులు సంపాదించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్‌ కల్యాణ్‌ మాత్రమే. ఆయనకే ప్యాకేజీ స్టార్‌.. రీచార్జ్ స్టార్  అనే పేరు ఉంది. అనేక సందర్భాల్లో రాజకీయ, ఇతర అవసరాల కోసం అమ్ముడుపోయింది మీరు. మీ సినిమాలకు నష్టాలు వచ్చి ఉంటాయేమో కానీ, రాజకీయాల్లో మాత్రం పవన్‌ ఎప్పుడూ నష్టపోలేదు. లాభం పొందింది మీరు మాత్రమే.

 
- వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిశ్రమలో ఈ రాష్ట్రంలో ఉన్న అయిదుకోట్ల మంది ప్రజలకు లాభాలు వస్తున్నాయి. మా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంతో లక్షా 15వేల కోట్ల రూపాయిలు డీబీటీ ద్వారా బడుగు, బలహీన, పేద, మైనార్టీ వర్గాలకు నేరుగా పంచిన ప్రభుత్వం ఇది. ప్యాకేజీ స్టార్‌ పేరు సంపాదించిన రాజకీయ నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా? ఫోన్‌లో రీఛార్జ్‌ అయిపోతే రీచార్జ్‌ చేయించుకున్నట్టుగా.. ప్యాకేజీలను రీఛార్జ్‌ చేసుకునే స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. కనీసం సిద్ధాంతాలు, రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తివి, స్థిరత్వం లేని నువ్వు మా గురించి మాట్లాడటం చూస్తుంటే నవ్వొస్తోంది. 

 
12- రాజకీయాల్లో ఒంటరిగానే పోరాటం మొదలు అవుతుంది. అది వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని చూసి నేర్చుకో పవన్‌. వైయస్స్‌ఆర్‌ గారి మరణం తర్వాత జగన్‌గారిని ఒంటరిని చేస్తే .. ఆరోజు మొదలుపెట్టిన ఒక అడుగు... ఇవాళ 151మంది శాసనసభ్యులు, 22మంది పార్లమెంట్‌ సభ్యులతో సాధించిన అద్భుతమైన విజయాన్ని చూసి నేర్చుకో. మీ పక్కనున్న ఫ్యాన్స్‌ మీదే మీకు ప్రేమలేదు. మీరు పవర్‌ లేని స్టార్‌ అని తెలిసినా.. పవర్ స్టార్ అని అంటున్న అమాయక ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు పాపం.

 
- పవన్‌కు నీతి, నిజాయితీ, రాజకీయాల్లో కొనసాగాలనే ఆలోచన ఉంటే.. ఎవరి భుజం మీదో తుపాకీ పేల్చాలనే ఆలోచన మానేసి  ఇకనైనా స్థిరమైన సిద్ధాంతం, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విమర్శలు చేస్తే స్వీకరిస్తాం. అంతేకానీ ఎవరి ప్రయోజనాల కోసమో వైయస్సార్‌ సీపీపై విమర్శలు చేస్తే సహించం. 

 
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను మొదటి నుంచీ వైయస్సార్‌సీపీ వ్యతిరేకిస్తుంది. మేం అదే స్టాండ్‌ మీద ఉన్నాం. అలాంటి మా మీద విమర్శలు చేసే హక్కు పవన్‌కు లేదని స్పష్టం చేస్తున్నాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా థర్డ్ వేవ్ భారత్ తలుపు తట్టిందా? పరిస్థితి ఏంటి?