కేంద్రాన్ని సంప్రదించనిదే అడుగు కదపని గవర్నర్: విసిగిపోయిన శశికళ వర్గం
తమిళనాడు రాజకీయ పరిణామాలపై గవర్నర్ విద్యాసాగర్‌రావు గురువారం తన నిర్ణయం ప్రకటించకుండా మరింత ఉత్కంఠకు తెరలేపారు. తాజా పరిణామాలు, తన అభిప్రాయాలతో ఆయన గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. గవర్నర్ ఏం నివేదిక పంపారు కేంద్రం ఏ మార్గదర్శనం
తమిళనాడు రాజకీయ పరిణామాలపై గవర్నర్ విద్యాసాగర్‌రావు గురువారం తన నిర్ణయం ప్రకటించకుండా మరింత ఉత్కంఠకు తెరలేపారు. తాజా పరిణామాలు, తన అభిప్రాయాలతో ఆయన గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. గవర్నర్ ఏం నివేదిక పంపారు కేంద్రం ఏ మార్గదర్శనం చేస్తుంది గవర్నర్ నిర్ణయం ఏమిటి తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, నాయకుడా, నాయకురాలా అనే ప్రశ్నలకు సమాధానంకోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
గవర్నర్ జాప్యందారీ విధానాలతో బలం పుంజుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన దూకుడును పెంచి శశికళను ఆత్మరక్షణలో పడేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపున తమకు అవకాశం ఇవ్వకపోతే నేరుగా రాష్ట్రపతి ఎదుట ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించేందుకు శశికళ వర్గం ఏర్పాట్లు చేసుకుంటోంది. కేంద్రం ఆదేశాలతో గవర్నర్ జాప్యం చేయడం వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఈ వివాదాన్ని ఇంకెంతోకాలం పొడిగించలేరని, 2, 3 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించక తప్పదని... సంక్షోభానికి సమాధానం దొరుకుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ కేంద్ర ప్రభుత్వం మాట విని పన్నీర్ సెల్వంకు బలపరీక్షకు అవకాశం ఇచ్చినా, తనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించకుండా వాయిదా వేసినా కేంద్ర ప్రభుత్వం మీద దండ యాత్ర చేయాలని శశికళ శిబిరం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం వరకు వేచి చూసి గవర్నర్ నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎదుట పరేడ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం రాత్రే 20 మంది ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు.
తమిళనాడులో అన్నా డీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రధాని మోదీ పన్నీర్‌తో నాటకం ఆడిస్తున్నారని శశికళ మద్దతుదారులు ఇప్పటికే బహిరంగంగా ఆరోపణలు చేశారు. అయితే ఈ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమంత్రి వెంకయ్య వివరణా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కేంద్రానికి నివేదిక పంపడం మరో వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది.
రాజ్యాంగం ప్రకారం అయితే గవర్నర్ శశికళతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించాలి. అక్రమాస్తుల కేసులో ఆమెకు ఇంకా శిక్ష పడనందువల్ల ఆమెను సీఎం చేయడానికి అడ్డంకి కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ అదే కేసును బూచిగా చూపి కేంద్రం ఆమెను వేచి చూడాలని చెప్తే.. పన్నీర్‌కు పరోక్షంగా కొండంత మేలు చేసినట్లు అవుతుంది. ఈ సమయంలోపు శశికళ శిబిరంలోఉన్న ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడానికి పన్నీర్‌కు అవకాశం లభిస్తుంది. లేదా పన్నీర్ సెల్వంకు బలపరీక్షకు అవకాశం ఇచ్చినా శశికళ తన శిబిరాన్ని కాపాడుకోవడం కష్టమే.
శాసనసభా పక్ష నాయకునిగా ఒకరిని ఎన్నుకున్నాక ప్రమాణస్వీకారాన్ని కేంద్రం తమ రాజకీయ ప్రయోజనాలకోసం వ్యూహాత్మకంగా జాప్యం చేయడమే సంక్షోభానికి కారణమని న్యాయవాది, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. వీళ్ల రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకునే సాధనలో భాగంగానే అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు, ప్రజల మనోభావాలను సాకుగా చూపుతున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇది భవిష్యత్తులోవిపరిణామాలకు దారితీయవచ్చని, తమకు నచ్చని వారిని అడ్డుకోవడానికి గవర్నర్‌ను ఓ సాధనంలా వాడుకునే దుస్సంప్రదాయానికి దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.