ఎమ్మెల్యేల పరేడ్‌కు అవకాశం ఇవ్వలేదంటే అర్థమేంటి?
మూడురోజులుగా ఎత్తులు పైఎత్తులతో ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం సాయంత్రం ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావుతో విడివిడిగా భేటీ అయినప్పటికీ ఫలిత
మూడురోజులుగా ఎత్తులు పైఎత్తులతో ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం సాయంత్రం ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావుతో విడివిడిగా భేటీ అయినప్పటికీ ఫలితం మాత్రం ఎవరికీ అనుకూలంగా రాకపోవడం ఆసక్తి గొలుపుతోంది. తాను రాజీనామాను ఉపసంహరించుకుంటానని, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, శాసనసభలో బలపరీక్షకు తనకు అవకాశం ఇవ్వాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేసినా, తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించిన శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినా గవర్నర్ తన నిర్ణయం మాత్రం ప్రకటించకుండా ఇరువర్గాల్లో మరింత ఉత్కంఠకు తెరలేపారు.
తమిళనాట ముఖ్యమంత్రి పదవికి బరిలో నిలిచిన ఇద్దరి వాదనలూ ఆలకించిన గవర్నర్ తాను అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి పంపారు. అయితే రాజ్‌భవన్ లోపల నుంచి బయటకు రాగానే అంతా మంచే జరుగుతుందని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేయడం... శశికళ చిరునవ్వు లేకుండా బయటకు రావడం, మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించడం వంటి దృశ్యాలు అనేక రకాల చర్చలకు దారి తీశాయి.
గవర్నర్‌ని కలిసిన తర్వాత చివరకు ధర్మమే గెలుస్తుందంటూ మీడియాముందు పన్నీర్ సెల్వం ప్రకటించి చిరునవ్వుతూ వెళ్లిపోగా, ఎమ్మెల్యేలతో కాకుండా ఐదారుమందితోనే రావాలని రాజ్‌భవన్ నుంచి వచ్చిన వర్తమానం శశికళను నిరుత్సాహానికి గురి చేసింది. పైగా గవర్నర్ నుంచి ఏమాత్రం సానుకూల స్పందనలు లేకుండా పూర్తిగా బిజినెస్ లైక్ తత్వంతో వాదనలు విని విషయం తర్వాత తేలుస్తామనే రీతిలో సాగనంపటం శశికళ వదనంలో నవ్వుల్ని మాయం చేసింది. గవర్నర్‌తో భేటీ పోయెస్ గార్డెన్‌లో అనుయాయులతో భేటీ అంత సులువు కాదని అర్థమైన శశికళ డీలాపడిన చిహ్నాలు స్పష్టంగా ఆమె వదనంలో కనిపించడం గమనార్హం.
దీంతో ఇక గవర్నర్‌ని నమ్ముకుంటే పని కాదని బోధపడిన శశికళ వీలైనంత త్వరలో రాష్ట్రపతి వద్దకు తనకు మద్దతిస్తున్న ఎంఎల్ఏలను తీసుకెళ్లి అక్కడ విషయం తేల్చుకోవాలని పట్టుదలకు వచ్చినట్లు సమాచారం.