Publish Date: Sat, 18 Apr 2026 (20:20 IST)
Updated Date: Sat, 18 Apr 2026 (20:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ రాసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విధానాన్ని ఈ విద్యా విధానం నుంచే అమలు చేస్తున్నట్టు పేర్కొంది.
ఇంప్రూప్‌మెంట్ విద్యార్థుల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇకపై ద్వితీయ ఇంటర్ విద్యార్థులూ తమ మార్కులను మెరుగుపరుచుకొనే అవకాశాన్ని ఈ ఏడాది నుంచే కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల బోర్డుల్లో అమలులో ఉన్న ఇంప్రూవ్‌మెంట్ విధానాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం చర్చించి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ద్వితీయ ఇంటర్ పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ప్రథమ సంవత్సరం తరహాలోనే సబ్జెక్టుల వారీ ఉత్తమ మార్కుల విధానంతో ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్‌మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు.
ఇటీవల ఇంటర్ ఫలితాలను ప్రకటించిన ఇంటర్‌బోర్డు అధికారులు మే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకూ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానాన్ని ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే అమలు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా స్పష్టం చేశారు.
గత నెలలో జరిగిన పరీక్షలు రాసిన ప్రథమ, ద్వితీయ ఇంటర్ విద్యార్థులు పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ.. పాస్ అయిన పేపర్లలో మాత్రం ఇంప్రూవ్‌మెంట్ కోసం హాజరు కావొచ్చన్నారు. ప్రతి పేపర్‌లో ఉత్తమ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయ్యే వరకు ఆ పేపర్లు రాసేందుకు ఎలాంటి పరిమితి లేదన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ అవకాశం లేదని స్పష్టం చేశారు పరీక్ష ఫీజు రూ.600తో పాటు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20 నుంచి 27వరకు అవకాశం కల్పించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.