తిరుమల నడకదారిలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. అలిపిరి నడకదారిలో కర్నూలుకు చెందిన భక్తులపై దొంగలు దోపిడీకి యత్నించారు. భక్తులు ప్రతిఘటించడంతో దొంగలు పారిపోయారు.
నిన్న సాయంత్రం చీకటి పడే సమయానికి అలిపిరి మార్గం నుంచి కర్నూలుకు చెందిన భక్త బృందం తిరుమలకు బయలుదేరింది. చిన్నపిల్లలతో పాటు మొత్తం 9 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు.
నడిచి వస్తుండగా సరిగ్గా నడకదారికి సగభాగంలో నలుగురు యువకులు కనిపించారు. వారు వీరి వెనుకలే వస్తూ టార్చ్ లైట్ వారి ముఖంపై వేస్తూ హేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తరువాత చిన్నపిల్లల మెడలో ఉన్న బంగారు చైన్లను లాక్కునేందుకు ప్రయత్నించారు.
దీంతో భక్తబృందంలోని ముగ్గురు మగవారు దొంగలతో ప్రతిఘటించడంతో పాటు వారితో పాటు ఉన్న వారు గట్టిగా కేకలు వేయడంతో దగ్గరలో నడిచివస్తున్న కొంతమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. భక్త బృందం ఎక్కువగా వస్తుండడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. అయితే మోకాళ్ళ మిట్ట వద్దకు వెళ్ళిన తరువాత టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే మొబైల్ వ్యాన్‌లో ఘటనా స్థలి వద్దకు వెళ్ళారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.