కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో జనం ఒమిక్రాన్ వేరియంట్ అంటేనే వణికిపోతున్నారు. అసలు దాన్ని గుర్తించడానికి పరీక్షలు కూడా ఇక్కడ లేవని ఆందోళన చెందుతున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇది శుభవార్త. ఇక హైదరాబాద్, పుణె వెళ్లక్కరలేదు.. కేరళ తర్వాత విజయవాడలోనే అధునాతన ల్యాబ్ టెస్టింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేశాయి.
రాష్ట్రాలలో కేరళ తర్వాత ఏపీలోనే ఈ ల్యాబ్ ఏర్పాటైంది. జీనోమ్ సీక్వెన్సింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. గత వారం రోజులుగా అధికారులు ట్రైయిల్ రన్ నిర్వహించారు. ఇపుడు ఇక్కడ విజయవాడలోనే జీనోమ్ పరీక్షలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భయం వెంటాడుతోంది. రోజు, రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించే ల్యాబ్‌లు అతికొద్ది సంఖ్యలోనే ఉన్నాయి. ఏపీలో శాంపిల్స్ సేకరించి పుణె, హైదరాబాద్ పంపించాల్సి ఉంటుంది.. ఆ రిపోర్టులు వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఆ టెన్షన్ అక్కర్లేదంటోంది జగన్ సర్కార్.. విజయవాడలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసింది.
విజయవాడ సిద్దార్ధ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఒమిక్రాన్ నిర్ధారణ కోసం రెండు కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలలో కేరళ తర్వాత ఏపీలోనే ఈ ల్యాబ్ ఏర్పాటైంది. డెల్టా, ఓమిక్రాన్ మొదలైన కోవిడ్-19ల ఉత్పరివర్తనలు, రూపాంతరాలను ఇక్కడ ల్యాబ్‌లో గుర్తించే సదుపాయం ఉంటుంది. ల్యాబ్ పనితీరులో సీఎస్‌ఐఆర్, సీసీఎంబీ హైదరాబాద్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని వైద్య అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ నిర్థారణకి శాంపిల్స్‌ని పుణె, హైదరాబాద్ సీసీఎంబికి వైద్య ఆరోగ్యశాఖ పంపించేది.. ఇప్పుడు విజయవాడలోనే సాంకేతిక ల్యాబ్ అందుబాటులోకి రావడంతో ఆ టెన్షన్ లేకుండా పోయింది.
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల శాంపిల్స్‌లో కొన్నింటిని ర్యాండమ్ పద్ధతిలో ఇక్కడి ల్యాబ్‌లో పరీక్షిస్తారు. దీని ద్వారా అవి ఏ రకానికి చెందిన మ్యుటెంట్‌లో తెలుసుకోవచ్చు. విజయవాడలోనే ల్యాబ్ అందుబాటులోకి రావడంతో ఇక టెస్టులు, రిపోర్టుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. శాంపిల్స్ సేకరించి విజయవాడకు పంపితే సరిపోతుంది.