తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. జాతరలో చివరి ఘట్టం విశ్వరూపదర్శనం బుధవారం తెల్లవారుజామున జరిగింది. వందలాదిమంది భక్తులు విశ్వరూపంలోని గంగమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి విశ్వరూపంలో తయారు చేసిన మట్టిని సేవిస్తే మంచిదన్న నమ్మకంతో భక్తులు తెల్లవారుజామున పోటెత్తారు.
పేరంటాల వేషాన్ని ధరించిన వంశస్థులు అమ్మవారి చంపను నరకడంతో జాతర పూర్తవుతుంది. ప్రతియేటా ఇదే విధంగా విశ్వరూపాన్ని దేవస్థానం నిర్వహిస్తూ వస్తోంది. విశ్వరూపం కోసం ఉపయోగించిన వాల్మీకీ మట్టిని పొందేందుకు భక్తులు పోటీలు పడ్డారు. బంకమట్టిని స్వీకరిస్తే దీర్ఘకాలిక వ్యాధులు, గృహ బాధలు, దేహబాధలు, భయం నశిస్తాయని భక్తుల నమ్మకం.