మితిమీరిన (DJ sound) డీజే సౌండ్ వద్దని చెప్పినా చాలామంది పట్టించుకోవడంలేదు. దీనితో ఈ భారీ డీజె శబ్దం వల్ల పలుచోట్ల కొంతమంది గుండెపోటుతో (Heart attack) మృత్యువాత పడుతున్నారు. ఇటీవల జరుగుతున్న గణేష్ నిమజ్జనం కార్యక్రమాల్లో ఈ డీజే సౌండ్ మితిమీరిన శబ్దంతో పెట్టేస్తున్నారు. ఈ శబ్దం వల్ల విజయనగరం జిల్లా బొబ్బాదిపేటకు చెందిన హరీష్ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు.
డీజే సౌండ్ బాక్సుల ముందు డ్యాన్స్ చేస్తుండగా అధిక శబ్దం కారణంగా స్టేజిపైనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇటీవలే అతడు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాన్ని కూడా సాధించినట్లు గ్రామస్తులు తెలిపారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజేతో అతడి ప్రాణాలు పోవడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర శోకంతో నిండిపోయారు.