మితిమీరిన సౌండ్, అత్యుత్సాహంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఓ యువకుడు దసరా ఉత్సవాల్లో డాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు.
అమలాపురం సమీపంలోని కొంకాపల్లి దసరా వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 21 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోయాడు. అప్పటివరకూ సరదాగానే గడిపిన యువకుడు.. ఒక్కసారిగా స్పృహ తప్పిపోయేసరికి చుట్టుపక్కలవాళ్లు కంగారుపడ్డారు.
వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతనిని పరీక్షించిన వైద్యులు ఆ యువకుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. మృతుడు బండారులంకకు చెందిన 21 ఏళ్ల వినయ్‌గా గుర్తించారు.
కోనసీమ ప్రాంతంలో దసరాకి చెడీ తాలింఖానా విన్యాసాలతో దసరా వేడుకలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో డీజేకి అనుగుణంగా స్టెప్పులేస్తూ వినయ్ కుప్పకూలిపోవడంతో అంతా షాక్‌కి గురయ్యారు. వినయ్ డీజే బాక్సులకు అతి దగ్గరగా డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా గుండెచప్పుడు పెరగడం వల్లే చనిపోయి ఉండవచ్చునని చెబుతున్నారు.