విశాఖలో స్వైపింగ్ మిషన్ల స్కామ్ కలకలం సృష్టిస్తోంది. నకిలీ పే కార్డులు, స్వైపింగ్ మిషన్లతో బ్యాంకులకు టోకరా వేసిందో ఘరానా ముఠా. మధురవాడ, పెందుర్తి, మారికవలస లాంటి శివారు ప్రాంతాలే అడ్డాగా ఈ దందా సాగించారు కేటుగాళ్లు.
కమిషన్ల రూపంలో ఇప్పటికే రూ. లక్షలు కాజేశారు. నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బ్యాంకులు, ఏటీఎంలు లేని మారుమూల ప్రాంతాల్లో స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. నాబార్డు స్వైపింగ్ స్కీమ్ కింద కొన్ని ఏజెన్సీలకు ఈ మిషన్లను ఇచ్చారు. వీరికి వందకు 3 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే లక్ష రూపాయల లావాదేవీలు జరిగితే రూ.3 వేలు చెల్లించాలి. ఇదే అదనుగా రెచ్చిపోయారు కేటుగాళ్లు.. బ్యాంకులను మేనేజ్ చేసి అడ్డగోలుగా స్వైపింగ్ మిషన్లు, నకిలీ కార్డులు సంపాదించారు.
దాదాపు 5 వేల కార్డుల ద్వారా స్వైపింగ్ మిషన్లతో లావాదేవీలు చేస్తున్నారు. అలా చేసిన నగదును ఫేక్ అకౌంట్లలోకి మళ్లిస్తున్నారు. మళ్లీ అదే నగదుతో పదేపదే స్వైపింగ్ చేస్తున్నారు. అంటే బ్యాంకుల నుంచి వచ్చే కమిషన్ కోసం దొంగ ట్రాన్సాక్షన్లను క్రియేట్ చేస్తున్నారు.
ఈ విధంగా రోజుకి కనీసం రూ.70 వేల వరకు కమీషన్ కింద సంపాదిస్తున్నారు. నెలకి లక్షల్లో దోచేస్తున్నారు. ఈ ఘరానా మోసగాళ్లను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.