Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం.. అలాంటిది నా చేతుల మీదుగానే.. : ప్రణబ్ ఆత్మకథ

తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం.. అలాంటిది నా చేతుల మీదుగానే.. : ప్రణబ్ ఆత్మకథ
, గురువారం, 7 జనవరి 2021 (08:31 IST)
కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరుగడించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ "మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ : 2012-2017" పేరుతో ఆత్మకథను రాశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆయన తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను పూర్తి వ్యతిరేకమని అందులో పేర్కొన్నారు. కానీ, చివరకు తన చేతుల మీదుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఊహించలేకపోయినట్టు చెప్పుకొచ్చారు. 
 
కాగా, ఈ పుస్తకంలోని పలు విషయాలు బయటకు వచ్చి సంచలనం సృష్టించాయి. తాజాగా, తెలంగాణ గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం మరోమారు సంచలనమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడకపోగా, మరింత దారుణంగా తయారైందని ప్రణబ్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
కాంగ్రెస్‌కు ప్రతికూల వాతావరణం ఏర్పడి మరింత క్షీణించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు అత్యంత బలమైన రాష్ట్రమని, గతంలో అక్కడ కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు లభించాయని గుర్తు చేశారు. పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాల్లో ఓడిపోవడం వల్లే అధికారానికి దూరమైందన్నారు.
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని తాను భావించానని ప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. బీజేపీకి గరిష్టంగా 200 స్థానాలు వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని భావించానని రాసుకొచ్చారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా ఓటమి పాలవడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడిందన్నారు. 
 
పార్టీని నడిపించడంలో సోనియాగాంధీ వైఫల్యమే ఆ పరిస్థితులకు కారణమన్న ప్రణబ్.. తాను రాష్ట్రపతి అయిన తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిలో మార్పు వచ్చిందని ప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని బలమైన నేతగాను, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను విధేయుడుగా ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు: ఏ1 నిందితుడు అరెస్టు