దొంగ ఓట్లను పరిశీలించి వాటిని తొలగించాలని తామే ఫామ్-7 దరఖాస్తులు ఇచ్చామని గొప్పగా చెప్పుకొస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్ ఓటుకే సమస్య వచ్చి పడింది. తన ఓటును తొలగించాలని ఆయనే దరఖాస్తు చేసినట్లుగా ఎన్నికల అధికారికి ఆన్‌లైన్‌లో ఫామ్-7 ద్వారా ఒక వినతి వచ్చినట్టు చెప్పారు. ఈ మేరకు పులివెందుల ఎన్నికల అధికారి(ఆర్వో) సత్యం మంగళవారం విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
'పులివెందులలోని 134 బాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్‌కు ఓటు హక్కు ఉంది. ఈ ఓటును తొలగించాలని జగనే స్వయంగా దరఖాస్తు చేసుకున్నట్లు ఫామ్-7లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు వచ్చింది. దీనిని చూడగానే జగన్ బంధువైన జనార్దన్‌రెడ్డికి సమాచారం ఇచ్చాం. ఆయన జగన్ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని ఆర్వో చెప్పారు.
అయితే ఓటు తీసేయాలని తాను ఫామ్-7 దరఖాస్తు చేయలేదని జగన్ బదులివ్వడంతో గుర్తుతెలియని వ్యక్తులెవరో ఈ పని చేసారని భావించిన ఆర్వో కలెక్టర్ హరికిరణ్‌కు సమస్యను నివేదించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇదిలావుండగా.. తాను ఆన్‌లైన్‌లో ఫామ్-7 దరఖాస్తు చేయలేదంటూ లిఖితపూర్వకంగా బదులివ్వమని కూడా జగన్‌కు స్పష్టం చేశారు.