Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలిపిరి నడక దారిలో మరో ఐదు చిరుతల సంచారం...

Leopard_Cat
, సోమవారం, 14 ఆగస్టు 2023 (11:21 IST)
తిరుమల అలిపిరి కాలినడక పరిసరాల్లో మరో ఐదు చిరుతలు సంచరిస్తున్నాయి. తిరుమల ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ట్రాప్‌ కెమెరాల్లో చిరుతల దృశ్యాలు నమోదయ్యాయని చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో చిరుతల నుంచి భక్తులకు భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే), అటవీశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో మధ్యాహ్నం 3గంటలకు ఈ సమీక్ష జరగనుంది. కాగా తిరుమల - అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున ఓ చిరుత చిక్కింది. 
 
బోనులో చిక్కే క్రమంలో చిరుత స్వల్పంగా గాయపడటంతో.. ఎస్వీ జూ పార్కులో చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఈ చిరుత మ్యాన్‌ ఈటర్‌ అవునా? కాదా? అనే అంశంపై పరీక్షిస్తామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన చిరుతను ఎక్కడ వదలాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తితిదే ఈవో ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు.
 
ఎట్టకేలకు బోనులో చిరుత... 
 
తిరుమల నడక మార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది. చిరుత పట్టుకునేందుకు సిబ్బంది ఘటనా స్థలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఫలితంగా తిరుమల - అలిపిరి కాలినడక మార్గంలో ఏదో మైలు రాయి వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కింది.
 
కాగా, ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం కాలి నడక మార్గంలో తిరుమలకు వెళుతుండగా అకస్మాత్తుగా చిరుత బాలిక దాడి చేసింది. తల్లిదండ్రుల కంటే ముందు వెళుతున్న బాలికపై రాత్రివేళ దాడి చేసిన చిరుత ఆ తర్వాత పొదల్లోకి చిన్నారిని ఈడ్చుకెళ్లి చంపి తినేసింది. 
 
మరుసటి రోజు ఉదయం బాలిక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగడంతో తిరుమల అదికారుల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెట్ల మార్గంలో చిన్నారులను అనుమతించరాదని వంద మంది భక్తుల చొప్పున ఓ బృందంగా నడక మార్గంలో పంపించేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో నుంచి చౌక 5జి ఫోన్ - త్వరలో విడుదల