మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా అసలే ఆర్థిక కష్టాల్లో చిక్కుకునివున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఆగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ సేషన్-2 విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం ఎస్ఎంఎస్-2లోని ఒక పైప్ లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీకై మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక దళాలు, రెస్క్యూ టీమ్‌లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద తీవ్రత, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది.
కాగా, ఆర్థిక కష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయించిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు.