వైకాపా నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఆయనపై ఏపీ పోలీసులు ఒకదాని తర్వాత ఒక కేసు నమోదు చేస్తున్నారు. దీంతో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా బోరుగడ్డ అనిల్‌కు గుంటూరు నాలుగో కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
తన స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాలంటూ పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును 2016 మే 9న అనిల్ బెదిరించాడు. అప్పట్లో సర్వేయర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అనిల్ గత ఎనిమిది సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు.
దీంతో అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో అనంతపురం జైలులో ఉన్న అనిల్‌ను మంగళవారం పీటీ వారెంట్‌పై పోలీసులు గుంటూరు తీసుకువచ్చారు. గుంటూరు ఆరవ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాల్సి ఉండగా, ఆ మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఇన్‌చార్జి అయిన నాలుగో కోర్టు మెజిస్ట్రేట్ శోభారాణి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు అనిల్‍కు వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పోలీసులు అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మరోవైపు, అనిల్ బెయిల్ పిటిషన్‌ను నరసరావుపేట రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం గాయత్రి మంగళవారం డిస్మిస్ చేశారు. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో 'మార్చి 24న పోలీసులు ఆయన్‌ను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అప్పటి నుంచి రిమాండ్ పోడిగిస్తూ వస్తున్నారు.