Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్మికులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం చేయాలి: కేంద్రానికి మంత్రి మేకపాటి విజ్ఞప్తి

కార్మికులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం చేయాలి: కేంద్రానికి మంత్రి మేకపాటి విజ్ఞప్తి
, గురువారం, 14 మే 2020 (18:12 IST)
రాష్ట్రప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు కేటాయించిన రూ.905 కోట్ల ఆర్థిక సాయానికి మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

సచివాలయం నాల్గవ బ్లాక్ లోని మొదటి అంతస్థులో ఉన్న తన ఛాంబర్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అంశాలను మంత్రి ప్రస్తావించారు.

ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందించాలని సూచించినట్లు మంత్రి వెల్లడించారు.

కేంద్రం చెప్పిన ప్రకారం చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు(లోన్స్) తీసుకునే అవకాశం ఉందన్నారు. అత్యవసరాల కోసం కేంద్రం అదనంగా రూ.20 వేల కోట్లు కేటాయించి చిన్న మధ్య తరహా పరిశ్రమల మూలధన పరిధిని పెంచిందన్నారు. ఎంఎస్ఎంఈ నిబంధనల ప్రకారం రూ.10 కోట్లకు పైగా ఆదాయం ఉండే కంపెనీలకు కూడా ఇప్పుడు అవకాశం రావడం శుభపరిణామన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 97 వేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వివరించారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు జరిగే ప్రయోజనంపై స్పష్టత రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. కేంద్రం ఎంఎస్ఎంఈలకు ఏ ప్రాతిపదికన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందో తేలాల్సి ఉందన్నారు.

ఈ ప్యాకేజీని రాష్ట్రాల వారీగా అమలు చేస్తుందా? లేదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. పాత రుణాలకు ఈ ఆర్థిక సాయం వర్తిస్తుందా లేదా అన్న అంశం తేలాల్సి ఉందన్నారు. కొత్త రుణాలను పూచీకత్తు లేకుండా ఇస్తారా అన్న అంశంపై మరింత స్పష్టతనిస్తే బాగుంటుందన్నారు. ఎంఎస్ఎంఈలతో పాటు కార్మికులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం చేయాలని ఈ సందర్భంగా కేంద్రానికి మంత్రి విజ్ఞప్తి చేశారు.

రూ. ౩ లక్షల కోట్ల ప్యాకేజీపై వీలైనంత వేగంగా మార్గదర్శకాలు ఇస్తే బాగుంటుందన్నారు. రుణాలపై మారిటోరియం, టాక్స్ హాలిడే ప్రకటిస్తే బాగుండేదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.  కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తే పారిశ్రామిక రంగాన్ని ఆదుకోగలుగుతామన్నారు. ఎంఎస్ఎంఈల విద్యుత్ బకాయిలపై ఒత్తిడి చేయొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని మంత్రి వివరించారు. 
 
ఎంఎస్ఎంఈలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుంచి తోడ్పాటు అందిస్తూనే ఉన్నారని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. రెండు వారాల క్రితమే రూ.905 కోట్లు  ఇన్సెంటివ్ ప్యాకేజ్ డిక్లేర్ చేశారని గుర్తుచేశారు. ఎంఎస్ఎంఈలకు విద్యుత్ ఛార్జీలు విషయంలో తగు చర్యలు తీసుకున్నామన్నారు.

ఈ విషయంలో చాలా రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్లినా ఏపీ మాత్రం వాయిదా వేయకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం  ద్వారా రూ. 128 కోట్లు ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరిందన్నారు.  ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం మోస్తుందని తెలిపారు. రూ.200 కోట్లు కార్పస్ ఫండ్ స్థాపించాలని మంత్రి చెప్పారు. ఇప్పటికే  సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ప్యాకేజీ అమలుకు చర్యలు చేపట్టామని, దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నామని తెలిపారు. 
 
రాష్ట్రంలో పర్చేజింగ్ పవర్ పారిటీ పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటును అధిగమిస్తుందన్నారు. ఇక రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ప్రజల సాధికారతకు ఉపయోగపడుతున్నాయని మంత్రి తెలిపారు. 
 
రాష్ట్రానికి ఎల్జీ పాలిమర్స్  కొరియన్ టీం వచ్చిందని, వారు  14 రోజులు ఇక్కడ అధ్యయనం చేయనున్నారని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు కుడా ఉన్నారని, హైపవర్  కమిటీ కూడా అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని హానికారక రసాయనాలను వినియోగించే 86 పరిశ్రమలకు నోటీసులు జారీ చేశామని మంత్రి తెలిపారు. ఆడిట్ తర్వాతే కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించామన్నారు. 

చివరగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు స్వాగతించాల్సిన అంశమన్నారు. ఈ క్రమంలో మార్గదర్శకాలు త్వరగా అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఒకవేళ అమలు అయ్యే క్రమంలో ఎత్తుపల్లాలు ఉంటే అధిగమించాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వస్థలాలకు పంపండి.. వలస కార్మికుల ధర్నా