4 లక్షల మందికి ఏటా ఆర్థికసాయం.. మంత్రి పేర్ని నాని

గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:38 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్ వంటి సొంత వాహనదారులకు సంవత్సరానికి 10 వేల చొప్పున నగదు చెల్లిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య వెల్లడించారు.

గురువారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి పేర్ని నాని... రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కలిసి  విలేఖర్లతో మాట్లాడుతూ ఇన్సూరెన్స్, వెహికిల్ ఫిట్ నెస్, మరమ్మత్తుల అవసరాల నిమిత్తం ఈ ఆర్థికసాయం మంజూరు చేస్తామన్నారు. 

రాత్రనక, పగలనక రేయింబవళ్లు కష్టపడుతూ అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్  వాహనదారుల కుటుంబాలను ఆదుకుంటానని గతంలో ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని మంత్రి వివరించారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ లో భాగంగా ప్రతి ఏటా డ్రైవర్ కమ్ ఓనర్ లకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం చేస్తానని ఇచ్చిన హామీని నిలుపుకునే దిశగా అడుగులు వేశారన్నారు. ఈ స్కీమ్ ప్రకారం రాష్ట్రంలో సుమారు 4 లక్షలకు పైగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్  కలిగిన వారికి లబ్ధి చేకూరుతుందన్నారు.

ఈ పథకానికి సంబంధించి సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అర్హులైన వాహనదారుల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా డీటీసీ/ఆర్టీవో/యూనిట్ ఆఫీస్/ఎంవీఐ ఆఫీస్/ ఈసేవ/ మీసేవ/ సీఎస్ సీ / ఎండీవో/ మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలయందు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అదే విధంగా గ్రామ/వార్డు వాలంటీర్లు వద్ద కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. సెల్ ఫోన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగించామని మంత్రి తెలిపారు. డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ కు సంబంధించి  రాష్ట్రంలోని పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ లు అయిన విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో అధిక సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాల్సిందిగా ఇప్పటికే ఆయా ప్రాంతాల కలెక్టర్లను ఆదేశించామన్నారు.

దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఎలాంటి తొక్కిసలాటలు, అపశృతులు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా దరఖాస్తుదారుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులకు సూచించినట్లు మంత్రి తెలిపారు. దరఖాస్తుదారులు అసంతృప్తి చెందకుండా దరఖాస్తులను సముచితరీతిలో తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ పథకానికి అర్హులైన వారు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రుణములేని బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ మరియు సంబంధిత అకౌంట్ వివరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైతే పై పత్రాలతో పాటు కులధృవీకరణ పత్రము నకళ్లను గ్రామాల్లో అయితే గ్రామ వాలంటీర్ కు పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు వాలంటీర్లకు అందజేయాలని సూచించారు.

ఆయా నకళ్లను గ్రామ/వార్డు వాలంటీర్లు పరిశీలించి వాహనం వాహన యజమాని సంరక్షణలో ఉందో లేదో తెలుసుకుని సదరు దరఖాస్తులను ఎంపీడీవో/సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీ/మున్సిపల్ కమిషనర్/బిల్లు  కలెక్టర్ కార్యాలయానికి పంపించడం జరగుతుందన్నారు.  అనంతరం సదరు దరఖాస్తులను ఆన్ లైన్ నందు తదుపరి చర్యల నిమిత్తం అప్ లోడ్ చేయడం జరుగుతుందన్నారు.

డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ ద్వారా అందించే 10 వేల రూపాయల ఆర్థిక సాయం 2019-20 సంవత్సరానికి గానూ ఇన్సూరెన్స్, ఫిట్ నెస్, రిపేర్ నిమిత్తం మంజూరు చేయడం జరగుతుందని మంత్రి వెల్లడించారు. అదే విధంగా సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్ ను కలిగి 25-09-2019లోగా వాహనముల రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్న ఓనర్ కమ్ డ్రైవర్ గా ఉండే వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.

ఈ స్కీమ్ నందు కుటుంబంగా భార్య, భర్త, మైనర్ పిల్లలను ఒక యూనిట్ గా పరిగణిస్తామన్నారు. అదే విధంగా అదే కుటుంబానికి చెందిన మేజర్ పిల్లలు ఎవరైనా ఉండి వారికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి వాహనము నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారిని వేరొక యూనిట్ గా పరిగణిస్తామని మంత్రి అన్నారు.ఒకవేళ భార్యపేరున వాహనం కలిగి భర్తకు లైసెన్స్ ఉన్న సందర్భంలో కూడా భార్యకు ఆర్థిక సాయం ఇవ్వబడుతుందని తెలిపారు.

వాహనదారులు ముఖ్యంగా ఎటువంటి రుణాలు లేని బ్యాంకు ఖాతాను అందజేయాల్సిందిగా దరఖాస్తుదారులకు సూచించారు. ఏ బ్యాంక్ కూడా ఈ పథకం కింద విడుదల చేసే ఆర్థికసాయాన్ని అప్పుల నిమిత్తం తీసుకోకుండా ఉండాలంటే  కొత్త బ్యాంకు ఖాతాను తెరిచి సదరు కొత్త అకౌంట్ ను పథకానికి దరఖాస్తు చేసే సమయంలో పొందు పరచాల్సిందిగా సూచించారు.

దరఖాస్తు దారుల సంఖ్య పెరిగినా కూడా ఆర్థికసాయం అందించే విషయంలో వెనకాడబోమని మంత్రి అన్నారు. పథకాన్ని ఏ ప్రాంతంలో లాంఛనంగా ప్రారంభించే విషయం త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రెస్ మీట్ అనంతరం రాష్ట్రంలోని డీటీసీ, ఆర్టీఐ, ఎంవీఐలతో జరిగిన వీడియోకాన్ఫరెన్స్ లో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను మంత్రి పేర్నినానితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, రవాణాశాఖ కమిషనర్ సీతారామాంజనేయులు వారికి వివరించారు. 

తక్షణమే ఆటో యూనియన్లను పిలిచి వారికి తగిన రీతిలో అవగాహన కల్పించాల్సిదిగా ఆదేశించారు. రేపు సాయంత్రానికి పథకానికి సంబంధించిన వివరాలను రవాణాశాఖ వెబ్ సైట్ లో పొందుపరుస్తామన్నారు. పథకానికి సంబంధించి ఎవరైనా సమస్యలున్నాయని దృష్టికి తెస్తే తప్పకుండా సంబంధిత సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. 

ఒకవేళ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా సత్వరమే స్పందించే విధంగా ఐటీ శాఖకు చెందిన టీమ్ పని చేస్తుందని తెలిపారు. దరఖాస్తుదారు స్వతహాగా రాసిచ్చే అడ్రస్ నే ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి పేరు సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే అన్న విషయం గమనించాలన్నారు.

ఒకే కుటుంబానికి చెందిన వారికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాహనాలు కలిగి ఉంటే ఒక వాహనం మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్లు ఈనెల 14వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా, భౌతిక దరఖాస్తు ద్వారా గానీ స్వీకరించబడతాయన్నారు.

25-09-2019న దరఖాస్తులు సమర్పించుటకు ఆఖరి తేదీగా నిర్ణయించామని తెలిపారు. 30-09-2019 న గ్రామ/వార్డు వాలంటీర్లు సదరు దరఖాస్తులను పరిశీలన చేస్తారని వెల్లడించారు. ఆయా ప్రాంత జిల్లాల కలెక్టర్లు 01-10-2019లోగా మంజూరు పత్రాలు జారీ చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు 04-10-2019న ఆర్థికసాయం బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం  జరుగుతుందని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరే క్రమంలో పథకానికి సంబంధించి లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించాల్సిందిగా అధికారులను మంత్రి కోరారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి మరింత మంచి పేరు తెచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. 

బ్యాంక్ అకౌంట్ నందు ఆర్థిక సహాయం అందించిన తర్వాత గ్రామ, వార్డు వాలంటీర్ల దరఖాస్తుదారుని వద్దకు వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశంతో పాటు సంబంధిత వివరములు అందిస్తారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో రవాణాశాఖ జాయింట్ కమిషనర్ లు రమాశ్రీ, ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కానిస్టేబుళ్ళ ఫలితాలను వెల్లడించిన హోం మంత్రి