Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండుగ రోజునా ఆగని రైతు పోరు.. 29వ రోజుకు దీక్ష..ఆగిన మరో రెండు గుండెలు

Advertiesment
పండుగ రోజునా ఆగని రైతు పోరు.. 29వ రోజుకు  దీక్ష..ఆగిన మరో రెండు గుండెలు
, బుధవారం, 15 జనవరి 2020 (09:10 IST)
ఏపీ రాజధాని రైతుల పోరు బుధవారం నాటికి 29వ రోజుకు చేరింది. పండుగ రోజునా అమరావతి కోసం పోరు కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. పోరాటమే పండుగ నినాదంతో ఇవాళ ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నారు.

రైతులకు మద్దతుగా సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న నారా, నందమూరి కుటుంబసభ్యులు నేడు రాజధానిలో పర్యటించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో పాటు లోకేష్‌ సతీమణి నారా బ్రహ్మణి , నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ఆందోళనలు చేస్తున్న రైతుల వద్దకు వచ్చి సంఘీభావం తెలపనున్నారు.
 
మందడం, తుళ్లూరుల్లోనూ నేడు మహాధర్నాలు నిర్వహించనుండగా వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పూజలు నిర్వహించి నిరసనలు తెలపనున్నారు. 
 
పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు ఇతర గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ఆందోళనలు చేపట్టనున్నాయి.
 
ఆగిన మరో రెండు గుండెలు
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో రెండు గుండెలు ఆగాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో గుండెపోటుతో రైతు ఇడుపులపాటి వెంకటేశ్వరావు(70) మృతిచెందాడు. గత కొద్ది రోజులుగా రాజధాని అమరావతిని తరలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో వెంకటేశ్వరరావు మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో మరణించాడు. వెంకటేశ్వరరావు రాజధాని నిర్మాణానికి ఎకరం 20 సెంట్లు భూమిని ఇచ్చాడు. అదేవిధంగా వెలగపూడికి గ్రామానికి చెందిన రైతు అంబటి శివయ్య (70) బుధవారం మరణించారు. రాజధాని తరలిపోతుందని మనోవేదనకు చెంది గుండెపోటుతో మరణించారు.
 
మహిళలు ఏకమైతేరాజ్యాలే కూలాయి:సుహాసిని
మహిళల పట్ల పోలీసుల దారుణంగా ప్రవర్తిస్తున్నారని తెదేపా నేత నందమూరి సుహాసిని అన్నారు. రైతులు ధైర్యంగా పోరాడాలని.. తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. అమరావతి పరిధిలోని మందడంలో రైతులు చేస్తున్న నిరసన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు.

అనంతరం సుహాసిని మీడియాతో మాట్లాడారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మహిళలపై లాఠీఛార్జి చేసి గాయపరచడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. మహిళలు ఏకమైతే రాజ్యాలే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. రైతులు, మహిళలు ధైర్యంగా ఉండి అమరావతి ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు.
 
అనాలోచిత విధానాలతో రైతులు వీధులపాలు: సీపీఐ
వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిపై వివాదం సృష్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో అమరావతి రైతులు వీధులపాలయ్యారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికలపైన, ఈ రెండు నివేదికలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీపైనా విమర్శలు చేశారు.

హైపవర్ కమిటీ విజయవాడ బస్టాండ్ లో భేటీ అవుతోందని, రాష్ట్ర రాజధాని బతుకు చివరికి బస్టాండ్ అయిందని విమర్శించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలన్నది తమ పార్టీ నిర్ణయమని మరోమారు స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజ్యాంగ బద్ధంగా ఉన్న హక్కులపరంగా పాలనా వికేంద్రీకరణ జరగాలని అయితే, జగన్ చెబుతున్న పాలనా వికేంద్రీకరణ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు, పవన్‌ కలిసి కుట్ర: ద్వారంపూడి