సంక్రాంతి సమయంలో కోస్తా జిల్లాల్లో అనధికారికంగా కోడిపందాలు జోరుగా సాగాయి. ప్రజాప్రతినిధులు సైతం హుషారుగా పాల్గొని, అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రక్క రాష్ట్రాలలో నుండి అనేక మంది ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు, వేలాది మంది ఆసక్తితో కోడి పందాల్లో జోరుగా బెట్టింగ్‌లు కాసారు. అందులోనూ పెద్దనోట్ల రాకతో ఇది మరింత ఎక్కువ అయ్యింది.
కృష్ణ జిల్లాలోని వంకనూరుకి చెందిన వ్యక్తి సిహెచ్ శ్రీనివాస్. కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లులో కోళ్ల పందాలలో పాల్గొని రూ.15,000 గెలుచుకున్నాడు, అయితే ఆ సొమ్మును తన ఖాతాలో వేసుకునేందుకు బ్యాంక్‌కి వెళ్లగా వాటిని నకిలీ నోట్లని చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు. దాదాపు 10,000 రూపాయల విలువ చేసే 500, 2000 రూపాయల నోట్లను నకిలీవి అంటూ వారు పేర్కొన్నారు.
నకిలీ డబ్బును అక్రమంగా సంపాదించినందున జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయాడు. అంతేకాకుండా చాలామంది వ్యక్తులు పందెంరాయళ్ల చేతుల్లో దారుణంగా మోసపోయి, తేలు కుట్టిన దొంగల్లా కిక్కురుమనకుండా ఉన్నారు. కంచికచర్ల పోలీసులు తెలంగాణ నుండి వచ్చి నకిలీ నోట్ల దందాను చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో శుక్రవారం నాడు తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో నకిలీ నోట్ల మార్పిడి చేస్తున్న రెండు గ్యాంగ్‌లను అరెస్ట్ చేసారు. వీరిపై గతంలో కూడా ఇలాంటి కేసులు ఉండడం కొసమెరుపు.