ఏపీలోని నంద్యాల జిల్లాలో పాణ్యం మండలంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కాలేజీ హాస్టల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా అక్కడ ప్రాణాలు కోల్పోయింది. మూడు నెలల క్రితమే ఈ కాలేజీలో చేరిన విద్యార్థినిని గర్భిణిగా ఉన్నప్పటికీ తోటి విద్యార్థులు గుర్తించలేకపోవడం గమనార్హం. ఆ విద్యార్థిని ప్రసవించేవరకు తోటి విద్యార్థులకు తెలియకపోవడం గమనార్హం.
శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విద్యార్థిని కాలేజీకి రావాలని కోరింది. రాత్రి 9 గంటలకు సమయంలో హాస్టల్ బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన యువతిని కాలేజీ యాజమాన్యం సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.