ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉన్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతానికి బయలుదేరి భద్రతా బలగాలపై మావోలు కాల్పులు జరిపారు.
దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా కూడా ఉన్నట్టు సమాచారం. అలాగే, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు - భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.