పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ (మున్సిపాలిటీ)కి నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 50 డివిజన్లకుగాను మూడు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దీంతో మిగిలిన వాటికి మార్చి 10న ఎన్నికలు జరిగాయి. అయితే అప్పట్లో వివాదాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఈ నెల 25న ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో నగర శివారులోని సీఆర్ రెడ్డి కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన అధికారులు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. లెక్కింపులో కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. కౌంటింగ్ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది.
మొత్తం 50 డివిజన్లకు గాను వైసీపీ 47 స్థానాల్లో పోటీ చేయగా, టీడీపీ 43, జనసేన 20 చోట్ల పోటీ చేసింది. ఇతర అభ్యర్థులతో కలిసి మొత్తం 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 30న మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది.