ఏపీలోని ఏలూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షల మేరకు అప్పు చేసిన ఓ వివాహితుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని ప్రగడపల్లిలో జరిగింది.
పోలీసుల కథనం మేరకు.. ప్రగడపల్లి గ్రామానికి చెందిన కడిమి సుబ్రహ్మణ్యం(24) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి నిర్మాణానికి సుమారు రూ.4 లక్షలు అప్పు చేశారు. ప్రస్తుతం ఎక్కడా కూలీ పనులు దొరక్కపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఈ నెల 13వ తేదీన పురుగుల మందు తాగారు.
దీన్ని గమనించిన బంధువులు, గ్రామస్తులంతా కలిసి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా చాగల్లులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందడంతో ఆదివారం మృతదేహాన్ని పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.