బాలల హక్కులకు ఎవరు భంగం కలిగించినా శిక్షార్హులవుతారని ఏపీ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యుడు జె.రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. 'కౌన్సెలింగ్ పేరిట లాకప్‌లో విద్యార్థులు' అనే పేరుతో ఓ పత్రికలో ప్రచురితమైన వార్తా కథనంపై ఆయన స్పందించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. జరిగిన ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
విద్యార్థులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడం ప్రాథమికంగా తప్పంటూ సంబంధిత ఉపాధ్యాయులను మందలించారు. దీనిపై కమిటీని నియమించి విచారణ చేయిస్తామని చెప్పారు. డీఈవో, కలెక్టర్‌తోనూ మాట్లాడతానన్నారు. ముగ్గురు బాధితులను విచారణకు పిలవగా వారిలో ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాలేదన్నారు. దీంతో ఒకరినే విచారించామన్నారు.
బాలల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయమై ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు జగ్గారావుకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో రాజేంద్రప్రసాద్ సమావేశమయ్యారు.
మరోవైపు, విద్యార్థులను పోలీస్‌స్టేషన్లో పెట్టించిన ఘటనలో ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు తాఖీదులు జారీచేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడమే కాకుండా పోలీసుస్టేషనులో అప్పగించిన సంగతి విదితమే. ఇలా ఎందుకు చేశారో కారణాలు తెలపాలంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.జగ్గారావు, ఉపాధ్యాయులు విజయ్‌ప్రకాశ్, గణపతి, సీహెచ్ సుధాకర్‌రెడ్డికి ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి డీఎస్‌ఈవో ఎన్‌వీ రవిసాగర్ శనివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు.