కడప జిల్లాలోని 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిలిచాయి. ఇటీవల విభజన చేస్తూ 13 పంచాయతీలను ప్రభుత్వం పెంచింది. విభజనను వ్యతిరేకిస్తూ కొందరు నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై స్పందించిన ఎపి హైకోర్టు విభజించిన 13 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు ఆపాలని స్టే ఇచ్చింది. హైకోర్టు స్టేతో 13 పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి.
రేపు ఉదయం కడపకు ఎస్ఈసీ
అమరావతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ శుక్రవారం నుంచి రెండు రోజులు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
శుక్రవారం అనంతపురం, కర్నూలు జిల్లాల్లో.. శనివారం కడప జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించనున్నారు. పర్యటన షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ప్రకటించింది.
శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి బెంగుళూరుకు విమానంలో వెళ్లి.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తారు. అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కర్నూలు వెళ్తారు.
అధికారులతో సమీక్ష అనంతరం రాత్రికి అక్కడే బసచేస్తారు. శనివారం ఉదయం రోడ్డుమార్గాన కడప వెళ్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు కడప నుంచి విమానంలో విజయవాడకు బయల్దేరతారు.