Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మండపేట మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు మృతి

మండపేట మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు మృతి
విజ‌య‌వాడ‌ , బుధవారం, 1 డిశెంబరు 2021 (10:31 IST)
తూర్పు గోదావ‌రి జిల్లా మండపేట మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. మండపేట రాజకీయాల్లో తనదైన శైలిలో రాజ‌కీయ వ్య‌వ‌హారాలు న‌డిపి ఆయ‌న గుర్తింపు పొందారు. మండపేటను సర్దార్ వేగుళ్ళ వీర్రాజు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న సమయంలో వల్లూరి నారాయణరావు ఆయనను   ఢీ కొట్టారు. 1981 లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో వేగుళ్ళ వీర్రాజు ఫ్యానల్ కు వ్యతిరేకంగా వల్లూరి నారాయణ రావు అన్ని వార్డుల్లో తమ ప్యానల్ తో పోటీపడ్డారు. హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. సర్దార్ వేగుళ్ళ వీర్రాజు ఫ్యానల్ గెలుపొందగా, నారాయణ రావు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు.
 
 
స‌మాజంలో అతి పేద మధ్యతరగతి వర్గానికి మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు నాయకత్వం వహించారు. సాదా సీదాగా సైకిల్ పై వార్డుల్లో తిరిగి ప్రజల మన్ననలు పొందేవారు. అదే సమయంలో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన వెంటనే ఆ పార్టీలో నారాయణరావు చేరారు. 1983లో అప్పటి ఆలమురు నియోజకవర్గ టీడీపీ టికెట్ ఎన్టీఆర్ ఆయనకు ఇచ్చారు. మాజీ మంత్రి సంగీత వెంకట రెడ్డి (చిన కాపు) కాంగ్రెస్ నుండి పోటీపడగా, నారాయణ రావు గెలుపొంది తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 1984 సంక్షోభంలో ఎన్టీఆర్ వెన్నంటి ఉన్నారు. 1985 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి టిడిపి అభ్యర్థిగా నారాయణ రావు బరిలో దిగి, కాంగ్రెస్ అభ్యర్ధి వాలిన సూర్యభాస్కరరావు పై విజయం సాధించారు. 
 
 
1989లో టీడీపీ అభ్యర్థి గా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సంగీత చేతిలో ఓడిపోయారు. అనంతరం 1994 లో టీడీపీ టికెట్ వివి ఎస్ ఎస్ చౌదరికి ఇవ్వగా, నారాయణరావు ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుండి సంగీత వెంకట రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చౌదరి విజయం సాధించారు. 2005 లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో నారాయణ రావు కోడలు వల్లూరి విమలకుమారి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. 
 
 
1994 లో కొంత కాలం పార్టీ ని విడినా  ఆయన టీడీపీ లోనే చివరి వరకు కొనసాగారు.2009, 2014, 2019 ఎన్నికల్లో మండపేట టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు కు కుడి భుజంగా మారి, ఆయన విజయానికి కృషి చేశారు. పార్టీ పట్ల నిబద్ధత గల నేత గా పేరు గడించారు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన తండ్రి దివంగత వల్లూరి రామస్వామి(బోజ్జియ్య) వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి సమాచారం అందుకున్న ప్రజలు, పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు  మండపేట వల్లూరి వారి వీధి లోని ఆయన స్వగృనికి చేరుకొని నివాళులర్పించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంగిరెడ్డి బెయిల్ : సీబీఐకు షాకిచ్చిన కడప కోర్టు -