ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఈ కామర్స్ రంగంలో ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫార్చురింగ్ కంపెనీ దావో ఇవిటెక్, దాని అనుబంధ సంస్థ అమరావతి ఈవీ కన్సల్టింగ్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) కార్యాలయంలో సంస్థ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి సమక్షంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండీ ఎన్ బంగార రాజు, దావో ఇవిటెక్ సీఈవో మైఖేల్ లియు, దావో ఇవిటెక్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ డెవలప్మెంట్) మనీష్ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, ఈ కామర్స్ బిజినెస్ లో చివరి విభాగం అయిన డెలివరీ సిబ్బంది కోసం అవసరమైన యువత నియామకాలు, శిక్షణకు సంబంధించిన మౌళికసదుపాయాలున్న ట్రైనింగ్ పార్ట్ నర్స్ ఎంపికలో దావో ఇవిటెక్ కు ఎపిఎస్‌ఎస్‌డిసి సహకరిస్తుంది. మన రాష్ట్రంలో దావో ఇవిటెక్ సంస్థ అమరావతి ఈవి కన్సల్టింగ్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థ రిక్రూట్, ట్రైనింగ్, డిప్లోయ్ మోడల్ డెలివరీ పర్సనల్స్ ను ఎంపిక చేసుకుని శిక్షణ ఇచ్చి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలలో ఉద్యోగాలు చేసేలా చేస్తుంది. ఉద్యోగాల్లో చేరిన వారికి దావో ఇవిటెక్ ఎలక్ట్రికల్ టూవీలర్ ను ఉచితంగా ఇస్తారు.
ఈ సందర్భంగా ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, ఎండీ ఎన్ బంగారరాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు తగిన జీవనోపాధిని కల్పించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు. మన రాష్ట్రంలోని యువతకు ఇచ్చే నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. అందుకు అనుగుణంగానే ఎపిఎస్‌ఎస్‌డిసి సిబ్బంది పరిశ్రమల ప్రతినిధులను కలిసి అక్కడ ఎలాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉందో తెలుకుని అందుకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.
అనంతరం దావో ఇవిటెక్ సీఈవో మైఖేల్ లియు, వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ డెవలప్మెంట్) మనీష్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రణాళిక ఉందన్నారు. ఎపిఎస్‌ఎస్‌డిసి సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఎంపిక చేసుకుని శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామన్నారు. తద్వారా రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువశక్తిని తయారు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో తామూ భాగస్వాములం అవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, ఎండీ బంగారరాజుతోపాటు దావో ఇవిటెక్ సీఈవో మైఖేల్ లియు, దావో ఇవిటెక్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ డెవలప్మెంట్) మనీష్, సీజీఎంలు కృష్ణమోహన్, సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.