Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

పిచ్చోడిని చేసేస్తున్నారు.. మరో ఆస్పత్రికి మార్చండి : డాక్టర్ సుధాకర్

Advertiesment
Dr Sudhakar
, బుధవారం, 27 మే 2020 (19:01 IST)
తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పటికీ.. తనను పిచ్చోడిగా మార్చేందుకు మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విశాఖ మానసిక రోగుల చికిత్స ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఓ లేఖ రాశారు. ఇది మీడియాలో లీక్ కావడంతో వైరల్ అయింది. 
 
ఈ లేఖలో డాక్టర్ సుధాకర్.. తనకు చేస్తున్న వైద్యం గురించి సవివరంగా వివరించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయినప్పటికీ తనకు మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చిందీ ఆ లేఖలో వివరంగా పేర్కొనడం గమనార్హం. 
 
తనకు ఇస్తున్న మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వాపోయిన డాక్టర్ సుధాకర్.. పెదవిపై వచ్చిన మార్పులను చూపిస్తూ తీసిన ఫొటోను లేఖకు జతచేశారు. తనను వెంటనే మరో ఆసుపత్రికి రెఫర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్.. కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఇచ్చే ఎన్95 మాస్కులు, పీపీఈ కిట్లను ఏపీ సర్కారు ఇవ్వడం లేదంటూ ఆరోపించడంతో ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 
 
ఆ తర్వాత విశాఖ పోలీసులు డాక్డర్ సుధాకర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ వ్యవహారం ఇపుడు హైకోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ ఇపుడు విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాయడం కలకలం రేగింది. కాగా, హైకోర్టు ఆదేశం మేరకు విశాఖ అదనపు సెషన్స్ కోర్టు మేజిస్ట్రేట్ డాక్టర్ సుధాకర్ వద్ద వాంగ్మూలం తీసుకుని హైకోర్టుకు కూడా సమర్పించారు.
 
మాస్కులు అడిగితే పిచ్చోడని ముద్రవేస్తారా? 
విశాఖ మానసిక చికిత్సాలయంలో తన కుమారుడు డాక్టర్ సుధాకర్‌కు అందిస్తున్న చికిత్స పట్ల అతని తల్లి కావేరీబాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ నక్సలైట్‌కు కూడా ఇలాంటి చికిత్స అందించరని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మాస్కులు అడిగితే పిచ్చోడన ముద్రవేస్తారా?  డాక్టర్‌ను పట్టుకుని నడిరోడ్డుపై చితకబాదటమేంటని? అసలు ఇది ప్రభుత్వమేనా? అని ప్రశ్నించారు. కేజీహెచ్‌కు తీసుకెళ్లిన రెండు గంటల్లోనే తన కుమారుడికి పిచ్చి అని నిర్ధారించారని, నర్సీపట్నం ఎమ్మెల్యే కావాలనే ఇలా చేస్తున్నారని కవేరీబాయి ఆరోపించారు. 
 
తాము చేతకాని వాళ్లం కాదని, హైకోర్టులో ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని అన్నారు. మాస్కులు అడిగితే పిచ్చోడని ముద్ర వేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. దళితులను అణగదొక్కాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకునివున్నట్టుగా ఉందన్నారు. తన కుమారుడికి ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనను వేరే ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. 
 
తమపై ప్రయోగాలు చేయవద్దని సీఎం జగన్‌ను కావేరీబాయి వేడుకున్నారు. సుధాకర్‌పై దాడిచేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు పెట్టాలని సుధాకర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సుధాకర్ కేసును వాదిస్తున్నందుకే లాయర్ శ్రావణ్‌కుమార్‌పై కేసు పెట్టారని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 28న కాంగ్రెస్ ఆన్‌లైన్ పోరాటం, దేనిపైన?