కుల మత రహిత, ఆధునిక భారతదేశం కోసం భారత రత్న, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన జీవిత కాలం పోరాటం చేసారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దళితుల పట్ల నాటి సమాజంలో ఉన్న సామాజిక వివక్షను అరికట్టడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు.
డాక్టర్ అంబేద్కర్ తన జీవితాన్ని పేదలు, అణగారిన, దిగువ తరగతి కులాల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేశారన్నారు. భారత రాజ్యాంగ పితామహునిగా దేశానికి ఆయన వెలకట్ట లేని సేవలు చేసారని గవర్నర్ ప్రస్తుతించారు. అంబేద్కర్ ఒక ప్రముఖ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా అన్ని వర్గాలతో కొనియాడబడ్డారని పేర్కొన్నారు.
గొప్ప స్వాతంత్య్ర సమరయోధునిగా దేశం కోసం ఎంతో శ్రమించారని, కుల రహిత సమాజం కోసం విశేష కృషి చేయటమే కాక, సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు, బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ చేపట్టిన కార్యక్రమాలు చారిత్రాత్మకమైనవని గౌరవ గవర్నర్ వివరించారు.