ఒక వైపు కరోనా వైరస్.. మరోవైపు ఎండలు.. ఇప్పుడు ఈ రెండూ తెలుగు రాష్ట్రాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా తెలంగాణ, ఏపీలలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
వడగాలులతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రావాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప మరో ఆరు రోజుల పాటు బయటికి రావద్దని సూచించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు.
కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో సూర్యుడు భగభగలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 28 వరకు ఇదే రకంగా ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే 29 నుంచి మాత్రం పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో పలు చోట్ల పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.