చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. హౌస్ అరెస్టు చేసిన చిత్తూరు టీడీపీ నేతలను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా ప్రజల వద్దకు వెళ్లే హక్కులేదా అని నిలదీశారు. వేలాది మందితో కుల సంఘాల మీటింగులు, ర్యాలీలు, సభలు, పెట్టుకోడానికి అనుమతి ఇస్తున్న ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు.
"ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా ప్రజల వద్దకు వెళ్లే హక్కులేదా.? ఆటవిక యుగంలో ఉన్నామా? కిరాతక పాలనలో వున్నామా? చంద్రబాబు నాయుడు గారి పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలనో హౌస్ అరెస్ట్ చేయటం దుర్మార్గం.
తక్షణమే హౌస్ అరెస్టు చేసిన చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులను విడిచిపెట్టాలి. ఏ హక్కుతో మా నేతలను గృహనిర్భిందించారు. 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర వున్న నాయకుడిగా, ఎన్.ఎస్.జి భద్రత వున్న నాయకుడు చంద్రబాబు గారి పర్యటన ఏవిధంగా అడ్డుకుంటారు? హిట్లర్ ముస్సోలినీ కలగలసిన వ్యక్తిగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
అహంకారం, ప్రతీకారం, నియంతృత్వం అజెండాగా జగన్ రెడ్డి పాలన ఉంది. వేలాది మందితో ర్యాలీలు, సభలు, కుల సంఘాల మీటింగ్ పెట్టుకోడానికి అనుమతి ఇస్తున్న ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఎన్నికల్లో వైసీపీ మంత్రులు చేసిన అక్రమాలు బట్టబయలు అవుతాయన్న భయంతోనే అనుమతి ఇవ్వటం లేదు.
చంద్రబాబు నాయుడు పర్యటన చూసి మండుటెండలో కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. మా నాయకులను నిర్భందించినంత మాత్రానా మా పోరాటం ఆగదు. ప్రజాక్షేత్రంలోనే మీ వైఫల్యాలు, అవినీతిని, గూండాగిరిని ప్రజలకు వివరిస్తాం.
మీ పాలనపై ప్రజలు విసిగెత్తారు కాబట్టే ప్రజల తరపున నిలబడుతున్న మా నాయకులను ఇళ్లలో నిర్భందిస్తున్నారు. పోలీసులు లేకుండా ప్రజల్లోకి వచ్చి తిరిగే ధైర్యం వైసీపీ నాయకులకు లేదు" అని విమర్శించారు.