వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని, అవినీతికి తావివ్వొద్దని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ స్పష్టం చేశారు. అన్ని బీసీ హాస్టల్లోనూ, రెసిడెన్షియల్ స్కూళ్లలోనూ తప్పనిసరిగా బయోమెట్రిక్ అమలు చేయాలని ఆదేశించారు.
సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ పథకాల అమలు తీరుపై బుధవారం సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. బీసీలను అన్ని విధాలా ఆదుకోవాలన్న సంకల్పంతో ఎన్నో పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా అమలుచేయాలని ఆదేశించారు. బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
బయోమెట్రిక్ తప్పనిసరి...
బీసీ రెసిడెన్సియల్ స్కూళ్లు, హాస్టళ్లలో బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర బీసీ రెసిడెన్సియల్ సూల్స్ కార్యదర్శి కృష్ణమోహన్ ను మంత్రి శంకరనారాయణ ఆదేశించారు. దీనివల్ల విద్యార్థుల డ్రాపౌట్లు నివారించడంతో పాటు రేషన్ వినియోగంలో అవకతవకులకు అడ్డుకట్ట వేయొచ్చునన్నారు. మెనూ అమలులో నిర్లక్ష్యం చూపొద్దన్నారు. రెసిడెన్సియల్ స్కూళ్లు, హాస్టళ్లలో డ్రాపౌట్లు నివారించాలని, 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, బీసీ కార్పొరేషన్ ఎం.డి. ఎం.రామారావు, కాపు కార్పొరేషన్ ఎం.డి. ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ బి.రామారావు తదితరులు పాల్గొన్నారు.