విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన దివ్య తేజస్విని అనే బీటెక్ విద్యార్థిని ఓ ప్రేమోన్మాది కిరాతకం కారణంగా కన్నుమూసింది. నాగేంద్రబాబు అలియాస్ స్వామి అనే యువకుడు దివ్య తేజస్వినిని గొంతుకోసి హత్య చేశాడు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
బంగారు భవిష్యత్తు ఉన్న దివ్య ఓ ప్రేమోన్మాది చేతిలో బలి కావడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు సరైన రక్షణ లేదని వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులు వ్యవధిలోనే అరడజనుకు పైగా ఘటనలు జరగడం ఆందోళకరమని తెలిపారు.
వరుసగా మృగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం మౌనం దాలుస్తున్నారు. చట్టరూపం దాల్చని దిశా చట్టం ఆర్భాటంగా ప్రారంభించిన దిశ పోలీసు స్టేషన్లు, అధికారం లేని హోంమంత్రి ఇక మహిళలకు న్యాయం జరిగేదెప్పుడు అంటూ నారా లోకేశ్ ట్విట్టర్లో స్పందించారు.